తుపాను బాధితుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

తుపాను బాధితుల ధర్నా

Nov 20 2026 12:07 AM | Updated on Nov 20 2026 12:07 AM

అమలాపురం రూరల్‌: ఇటీవలి తీవ్ర తుపానుతో నష్టపోయిన వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన బండారులంక అంబేద్కర్‌ నగర్‌లో బాధితులు గురువారం ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తుపాను కారణంగా వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయి, పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్నాయని అన్నారు. ఇళ్లు దెబ్బ తిని నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికుల కోసం గ్రామాల్లో తక్షణమే వీబీజీ రామ్‌జీ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు బాధిత పేద కుటుంబాలన్నింటికీ వెంటనే 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కార్మిక, పేద కుటుంబానికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే, కొబ్బరి చెట్లు నేలకొరిగి నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.పూర్తిగా లేదా పాక్షికంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను గుర్తించి, తగిన నష్టపరిహారంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న తహసీల్దార్‌ దివాకర్‌ అంబేద్కర్‌ నగర్‌కు చేరుకుని, నాయకుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. ప్రజల డిమాండ్లను, నష్టం వివరాలను తక్షణమే ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement