బియ్యం పంపిణీలో తేడాలు? | - | Sakshi
Sakshi News home page

బియ్యం పంపిణీలో తేడాలు?

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

కాట్రేనికోన: అర్నబ్‌ తుపాను ప్రభావమున్న సముద్ర తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని బాధితులందరికీ రూ.50 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం. కాట్రేనికోన పంచాయతీ గచ్చకాయలపోర సరిహద్దు గ్రామమైన కాపులపాలెంలో బాధితులకు రూ.50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలి. అయితే వీరి కార్డులు రాజానగరం రేషన్‌ షాపులో ఉండటం వల్ల మత్స్యకారులకు 50 కేజీలు, ఇతర కులాలకు 10 కేజీల చొప్పున పంపిణీ చేశారు.

● కాట్రేనికోన మండలం బలుసుతిప్ప, మగసానితిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, పోర, పల్లం, చిర్రయానం, నీళ్లరేవు తదితర గ్రామాల్లో చాలామంది లబ్ధిదారుల పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు ఒకేలా ఉండడంతో అసలైన లబ్ధిదారులను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అలాగే బయోమెట్రిక్‌ ధ్రువీకరణ లేకుండా ఆఫ్‌లైన్‌లో బియ్యం పంపిణీ చేయడం వల్ల అక్రమాలకు అవకాశం ఉందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ డీలర్లు, దళారులు కుమ్మకై ్క అర్హులైన లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేర్లపై బియ్యం తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● తుపాను అనంతరం కాట్రేనికోన మండల తీర ప్రాంతానికి చెందిన చాలామంది కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌, గుంటూరు, యానాం, కాకినాడ, భీమవరం తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. గ్రామాల్లో లేని వారి పేర్లను ఆసరాగా చేసుకుని బియ్యం పంపిణీ చేసినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

● మండలంలో తుపాను బాధితులందరికీ 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల చొప్పున, ఇతర కులాల వారికి 10 కేజీలు చొప్పున ఇవ్వడం సరికాదన్నారు. తుపాను కారణంగా అందరం తీవ్రంగా నష్టపోయామన్నారు.

● తుపాను బియ్యం క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబానికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలుసుతిప్ప, పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ తదితర గ్రామాల్లో పలువురు బాధితులు బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. బలుసుతిప్పలో సుమారు 250 మందికి అందలేదని, షాపు వద్ద ఉదయం నుంచి ఉన్నా బియ్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. కాగా.. ఈ మేరకు కాట్రేనికోన తహసీల్దార్‌ వి.రవికుమార్‌ను వివరణ కోరగా పంపిణీలో అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

బలుసుతిప్పలో బియ్యం కోసం రేషన్‌ షాపు వద్ద బాధితుల పడిగాపులు

తమకు 10 కేజీల బియ్యమే ఇవ్వడం సరికాదంటున్న కాపులపాలెం మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement