అన్నవరం: వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో కార్తిక పౌర్ణిమ సందర్భంగా ఈ నెల 24న జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో జాతీయ రహదారి నుంచి పుష్కర కాలువ రోడ్డు వరకు గత సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉన్న విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి చూపు స్వామి’ అనే శీర్షికన ఈ నెల 6న కథనం ప్రచురితమైంది. దీంతో ఆ రోడ్డును గత సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో సత్యరథం ట్రైల్ రన్‌లో భాగంగా ఆ రోడ్డు మీద ప్రయాణించేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో ఆ రోడ్డును వెడల్పు చేసి సీసీ రోడ్డు వేయడానికి సమయం సరిపోదు కాబట్టి తాత్కాలికంగా వెడల్పు చేసి చదును చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో జాతీయ రహదారి నుంచి పుష్కర రోడ్డు వరకు గల సర్వీస్ రోడ్డును పది అడుగుల నుంచి 14 అడుగులకు వెడల్పు చేస్తున్నారు. గిరిప్రదక్షణ జరిగే పుష్కర రోడ్డులో భక్తులకు ఇబ్బంది లేకుండా గులకరాళ్లను జేసీబీ బ్లేడ్‌తో తొలగించి చదును చేస్తున్నామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. రోడ్డుపై గుంతలు పూడ్చి భక్తులు సులభంగా నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా పలుచోట్ల టెంపరరీ టాయిలెట్లు అమర్చారు. తాగునీటి సదుపాయం కూడా కల్పిస్తున్నారు.


