చేను
చెరువై..
● వరుస తుపానులతో ‘వరి’కి ఉరి
● తుడిచిపెట్టుకుపోయిన పంట
● ఖరీఫ్ వరి సాగు
విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాలు
● 1,08,324 ఎకరాల్లో
పంట సర్వనాశనం
● నిర్వేదంలో అన్నదాతలు
సాక్షి, అమలాపురం: పంట చేతికొస్తుందన్న ఆశతో అప్పులు చేసి, సాగు చేసిన అన్నదాతకు చివరకు కన్నీరే మిగిలింది. నెలల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నేలకొరిగింది. వారం రోజుల వ్యవధిలో వరుసగా వచ్చిన అర్నబ్, మురసు తుపానులు డెల్టా రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. తుపాను గాలులు, భారీ వర్షాల కంటే ఇప్పుడు చేలల్లో నిలిచిన ముంపు నీరే వారిని ఎక్కువగా కుంగదీస్తోంది. రోజుల తరబడి నీటిలో నానుతున్న వరి కంకులు మొలకెత్తి, కుళ్లిపోయి పనికిరాకుండా పోతున్నాయి. నీరు బయటకు వెళ్లక కోతలు మొదలు పెట్టలేని పరిస్థితి. ఒకవేళ కోతలు కోసినా ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడి నీటిపాలై.. చెల్లించాల్సిన కౌలు తలకు మించిన భారమై.. చేసిన అప్పులు, వాటిపై వడ్డీ చెల్లించే దారి లేక అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. ఇటు పంట లేదు.. అటు ఆదాయం లేదు.. ప్రభుత్వం నుంచి పరిహారమూ అందలేదు. డెల్టా రైతులు ఎవరిని పలకరించినా నిర్వేదమే వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గత నెలాఖరు, ఈ నెల మొదటి వారంలో వరుసగా వచ్చిన తుపాన్ల ప్రభావంతో ఏకంగా 1,08,324 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అంటే సాగు జరిగిన విస్తీర్ణంలో అత్యధిక భాగం ప్రకృతి ప్రకోపానికి బలైంది. తుపాన్లు వచ్చి, చేలు నేలకొరిగి 15 రోజులు దాటుతున్నా చాలా ప్రాంతాల్లో ముంపు నీరు ఇంకా తొలగలేదు. తీర ప్రాంత మండలాలైన ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లితో పాటు అయినవిల్లి, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోనూ వరి చేలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
20 ఎకరాల్లో పంట నష్టం
మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన కోన రామకృష్ణారావు కౌలుదారు. సుమారు 20 ఎకరాల్లో వరి సాగు కోసం లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే దశలో తుపాను విరుచుకుపడింది. భారీ వర్షానికి పంట మొత్తం నీట మునిగి పాడైపోయింది. కోతలు కోసినా దక్కే అవకాశం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.


