● ఎన్నికల్లో అధికార పార్టీల
దౌర్జన్యాలపై నిరసన
● అమలాపురంలో వామపక్షాల ధర్నా
అమలాపురం టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను నిరసిస్తూ సీపీఎం, సీపీఐ శ్రేణులు స్థానిక గడియారం స్తంభం సెంటర్లో బుధవారం ధర్నా నిర్వహించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ దినం సందర్భంగా ఈ ఆందోళన చేపట్టాయి. సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని హరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, గూండాలు, రౌడీల బలం, అండతో దొంగ ఓట్లు, రిగ్గింగ్ల వంటి అక్రమాలకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా చేసి, కూటమి నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులకు దిగారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికల ప్రక్రియను అప్రజాస్వామికంగా మార్చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల, వామపక్షాల అభ్యర్థులను, పోలింగ్ ఏజెంట్లను కూటమి నాయకులు బూత్‌ల నుంచి దౌర్జన్యంగా తరిమేస్తూంటే, నామినేషన్ పత్రాలు చించివేస్తూంటే పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. రిగ్గింగ్ జరిగిన స్థానాల్లో ఎన్నికలను రద్దు చేయాలని, తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని వామపక్షాల నాయకులు, ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యాలకు తెగబడిన కూటమి నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, రానున్న పంచాయతీ ఎన్నికలైనా పారదర్శకంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు నశించాలని, వారి కదలికలపై పోలీసులు నిఘా ఉంచి చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. ధర్నాలో వామపక్ష నాయకులు జి.దుర్గా ప్రసాద్, టి.నాగ వరలక్ష్మి, సకిలే సూర్యనారాయణ, బుంగ సత్యనారాయణ, కె.గోపాలన్, చెల్లుబోయిన తాతారావు, జి.రవికుమార్, పుల్లెల ఆనంద్, దేవ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


