● సామాన్యులకు షాక్
● పాల ధరలు పెంచేసిన డెయిరీలు
● లీటరుకు రూ.2 నుంచి రూ.8 వరకూ పెంపు
ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అసమర్థ పాలనతో ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి బతుకు భారమై ప్రజలు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో పులి మీద పుట్రలా వివిధ డెయిరీలు పాల ధరలు పెంచేసి, సామాన్యులకు మరింత షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఈ ఏడాది వివిధ డెయిరీలు పాల ధరను లీటరుకు రూ.10 వరకూ పెంచేశాయి. పెరుగు ధర రూ.15, పనీర్ ధరను రూ.40 వరకూ పెంచేశాయి. ఇది చాలదన్నట్లు మరోసారి పాల ధరలను లీటరుకు రూ.4 నుంచి ఏకంగా రూ.8 వరకూ పెంచేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధరలు పెంచుతున్న డెయిరీలు ఆ మేరకు పాడి రైతుకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రస్తుతం పాడి రైతులకు వివిధ డెయిరీలు పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 మాత్రమే చెల్లిస్తున్నాయి. ఈ ఏడాది పలుమార్లు పాల ఉత్పత్తుల ధరలను పెంచగా ఒక్కసారి కూడా సేకరణ ధర పెంచకుండా తమను దగా చేశాయని పాడి రైతులు వాపోతున్నారు. పశుగ్రాసం కొరత, దాణా ధరలు పెరగడం, కూలీల కొరతతో సతమవుతున్న తమకు మాత్రం పాల సేకరణ ధర పెంచకుండా డెయిరీలు దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇష్టానుసారం ధరలు పెంచేస్తూండటంతో హోటల్‌లో టీ తాగడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
వివిధ డెయిరీలకు సంబంధించిన సాధారణ
పాల ధరల పెరుగుదల (లీటరుకు రూ.లో)
డెయిరీ పాత ధర కొత్త ధర
హెరిటేజ్ 76 80
అమూల్ 76 80
విశాఖ 72 76
సంగం 76 80
దొడ్ల 72 74
తిరుమల 74 76
వెన్న శాతం అధికంగా ఉండే క్రీమ్ పాల
ధరను లీటరుకు రూ.8 వరకూ పెంచారు.


