కౌలు రైతులకే పరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకే పరిహారం ఇవ్వాలి

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

కాజులూరు: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలను నేరుగా కౌలు రైతులకే ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షుడు వళ్ళు రాజబాబు డిమాండ్‌ చేశారు. శీలలంక, ఒంటితాడి తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, పంట సాగు హక్కుల (సీసీఆర్‌) కార్డులు పొందిన వారి పేరున పంటల నమోదు చేయించుకున్న కౌలు రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారాలు అందుతాయని అధికారులు చెబుతున్నారన్నారు. భూ యజమానులు అంగీకరించ లేదనే నెపంతో రెవెన్యూ అధికారులు మండలంలో 20 శాతం మించి సీసీఆర్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. దీంతో, పంటలు దెబ్బ తిని, పరిహారాలు అందక నిజమైన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని రాజబాబు డిమాండ్‌ చేశారు.

ఓటర్లకు టీడీపీ ‘బిస్కెట్‌’

ఆత్రేయపురం: ఓటర్లకు ఓ టీడీపీ నేత బిస్కెట్లు ఇస్తూండటం చర్చనీయాంశమైంది. ఆత్రేయపురంలో రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలిచారు. దీనికి కృతజ్ఞతగా, అలాగే, ఆత్రేయపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన తమ్ముడిని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ స్థానిక టీడీపీ నేత ఒకరు ఇంటింటా పర్యటించారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి తెచ్చిన బిస్కెట్‌ బాక్సులను ఓటర్లకు పంచుతున్నారు. అధికారులు ఇటువైపు ఓ లుక్కేస్తే మంచిది.

ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

అమలాపురం రూరల్‌: స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి, భారత విద్యారంగ అభ్యున్నతికి అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఆజాద్‌ జయంతి, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం, దేశాభివృద్ధి సాధ్యమవుతాయని ఆజాద్‌ విశ్వసించారని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

4 బస్సులపై కేసులు

అమలాపురం రూరల్‌: రవాణా శాఖ అధికారులు బుధవారం అమలాపురంలో కళాశాల బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్న శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 4 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.42 వేల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విద్యా సంస్థల బస్సులకు డ్రైవర్ల నియామకంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని యాజమాన్యాలకు సూచించారు. భారీ వాహనాలు నడిపిన ఐదేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే బడి బస్సులు నడిపేందుకు అర్హులని స్పష్టం చేశారు. అలాగే, 60 ఏళ్లు నిండిన డ్రైవర్లు బడి బస్సులు నడిపేందుకు అర్హులు కారని చెప్పారు. అధిక వేగంతో బస్సులు నడిపినా, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించినా డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement