● పరిషత్ పోరుపై ఓటర్ల నిరాసక్తత
● జిల్లాలో 66.27 శాతం ఓటింగ్ నమోదు
● అత్యధికంగా ఆలమూరులో
72.29 శాతం
● కాట్రేనికోనలో అత్యల్పంగా
58.72 శాతం
● తుపాను నష్టాల నిర్వేదంలో
రైతులు, వ్యవసాయ కార్మికులు
సాక్షి, అమలాపురం: ఓట్ల పండగపై వరుస తుపాన్లు నీళ్లు జల్లినట్లున్నాయి. కోనసీమలో జరిగిన పరిషత్ ఎన్నికలపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాలేదు. వారం రోజుల వ్యవధిలో వరుసగా వచ్చిన అర్నబ్, మురసు తుపాన్లు జిల్లా జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అర్నబ్ తుపాను వచ్చి దాదాపు పది రోజులైనా జిల్లాలో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. చాలా గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. తుపాను ధాటికి ఇళ్లు దెబ్బ తిన్నవారు, కొబ్బరి తోటలు నష్టపోయిన వారు, మత్స్యకారులు ఇంకా కోలుకోలేదు. వరి తదితర పంటలు ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు. ఇళ్లను వరద నీరు వీడలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా మురసు తుపాను ప్రభావంతో ఈ వారంలో జిల్లాను భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో, పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం ఇంకా కుదుట పడలేదు. చేతికొచ్చే సమయంలో వరి పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో కూలీలకూ ఉపాధి కరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాధారమైన ఈ జిల్లాలోని ప్రజలు ఎన్నికల కంటే తుపాన్లు మిగిల్చిన కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందలేదన్న అసంతృప్తి కూడా ఓటింగ్‌పై ఆసక్తి తగ్గడానికి ఒక కారణంగా కనిపించింది. ఫలితంగా జిల్లాలోని 19 మండలాల్లో 66.27 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
రాజోలు దీవిలో మరీ తక్కువ
అర్నబ్, మురసు తుపాన్ల దెబ్బకు రాజోలు దీవిలోని గ్రామాలు విలవిల్లాడాయి. విద్యుత్, రహదారులు, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. రాజోలులో 59.40, సఖినేటిపల్లిలో 61.02, మలికిపురం 62.94 శాతం చొప్పున మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. జిల్లాలో తీరప్రాంత మండలమైన కాట్రేనికోనలో అతి తక్కువగా 58.72 శాతం మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. మరోవైపు అత్యధికంగా ఆలమూరు మండలంలో 72.29 శాతం, ఉప్పలగుప్తంలో 71.84 శాతం, ఆత్రేయపురంలో 71.35 శాతం పోలింగ్ నమోదైంది.
మున్సిపల్ హింసాత్మక ఘటనల ప్రభావం:
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు కూడా ఓటర్లలో కొంత ఆందోళన కలిగించాయి. దీంతో, పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు కొందరు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ పోలింగ్ కేంద్రం గేటు వద్ద కూటమి ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను బయటకు పంపించారని స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కూటమి నాయకులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాల ప్రాంగణంలోనే ఇరు వర్గాలూ ఉండటంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటువంటి పరిస్థితులు కూడా ఓటింగ్ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.
ఓట్లు వేసిన ప్రముఖులు
పరిషత్ ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గోపాలపురంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఓటు వేశారు. ఆయన సతీమణి బేబీ మీనాక్షి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అల్లవరం మండలం గోడిలో, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఓటు వేశారు. వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి మామిడికుదురు మండలం వేగివారిపాలెంలో, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మలికిపురం మండలం దిండిలో, వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అయినవిల్లిలో, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం మండలం ఊడిమూడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రపురం మండలం హసన్‌బాదలో రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఓటు వేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంబాజీపేట మండలం నాగాబత్తులవారిపాలెం పోలింగ్ బూత్ జనసేన పార్టీ గుర్తుతో ఉన్న బ్యాడ్జీని చొక్కాపై ధరించి వచ్చారు. దీంతో, ఓటర్లు ప్రభావితమవుతారని వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఎమ్మెల్యే చొక్కాపై ఉన్న జనసేన గుర్తు బ్యాడ్జీని తొలగించారు. అనంతరం, ఈ పోలింగ్ బూత్‌కు కూతవేటు దూరంలో ప్రధాన రహదారికి అడ్డంగా నిలుచుని మరీ కూటమి నాయకులతో మంతనాలు జరపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
మండలాల వారీగా ఓటింగ్ వివరాలు
మండలం మొత్తం పోలైన
ఓటర్లు ఓట్లు
అయినవిల్లి 51,756 36,141
ఆలమూరు 60,009 43,381
అల్లవరం 53,569 34,988
అమలాపురం 72,829 49,029
అంబాజీపేట 49,891 33,548
ఆత్రేయపురం 54,687 39,020
ఐ.పోలవరం 56,501 36,877
కె.గంగవరం 52,362 34,687
కాట్రేనికోన 65,017 38,176
కొత్తపేట 65,077 44,382
మలికిపురం 62,238 39,928
మామిడికుదురు 56,111 36,767
ముమ్మిడివరం 35,500 23,295
పి.గన్నవరం 59,254 39,497
రామచంద్రపురం 58,326 39,074
రావులపాలెం 73,126 50,396
రాజోలు 59,154 35,139
సఖినేటిపల్లి 59,479 36,293
ఉప్పలగుప్తం 46,480 33,392


