ముంపు ముట్టడిలో.. ఓటుపాట్లు | - | Sakshi
Sakshi News home page

ముంపు ముట్టడిలో.. ఓటుపాట్లు

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

● జలదిగ్బంధంలో పలు పోలింగ్‌ కేంద్రాలు

● బురద, నీటితో ఓటర్లకు అవస్థలు

సాక్షి, అమలాపురం: వరుస తుపాన్లతో అతలాకుతలమైన జిల్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. పైగా, తుపాన్ల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేయవచ్చు. కానీ, ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. ఫలితంగా జిల్లాలోని అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఇటు ఓటర్లు, అటు ఎన్నికల సిబ్బంది నానా అగచాట్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అనేక పోలింగ్‌ కేంద్రాలు ముంపు ముట్టడిలో ఉండటం, విద్యుత్‌ సరఫరా లేకపోవడం ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు ఇబ్బందికరంగా మారింది. అనేకచోట్ల ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ.. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు ఘనంగా ప్రకటించడం విశేషం.

అవస్థలు ఇలా..

● మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు ముంపు బారిన పడ్డాయి. అయినప్పటికీ ఆయా కేంద్రాల్లోనే పోలింగ్‌ నిర్వహించారు. ముంపు నీరు, అడుగు వేస్తే జారి పడేలా ఉన్న బురదలోనే ఓటర్లు ఓటు వేయడానికి వెళ్లాల్సి వచ్చింది.

● రాజోలు దీవి ప్రాంతంలో ముంపు ప్రభావం ఎక్కువగా కనిపించింది. మలికిపురం మండలం మేడిశెట్టిపాలెం, లక్కవరం ఆర్‌ఆర్‌ గ్రూప్‌, తూర్పు పాలెం, చింతలమోరి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచింది.

● సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం, శృంగవరప్పాడు, అంతర్వేది, అంతర్వేది పల్లిపాలెం, గొంది, అంతర్వేదిపాలెం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజోలు బాలుర ఉన్నత పాఠశాల, కో ఆపరేటివ్‌ స్కూల్‌, పంచాయతీ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు ముంపులోనే కొనసాగాయి.

● మామిడికుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద బురద సమస్యను అధిగమించేందుకు చెక్క బల్లలు వేశారు.

● అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో బురద ఉండటంతో క్వారీ డస్ట్‌ చల్లారు. అది కూడా పోలింగ్‌ మొదలైన తరువాత కావడం గమనార్హం.

● అల్లవరం మండలం బెండమూర్లంకలోని 26, 27 పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు కనీసం సరైన దారి కూడా లేకుండా పోయింది. అప్పటికప్పుడు ఇంజిన్లతో నీటిని తోడేందుకు ప్రయత్నించినా ఫ లితం లేకపోయింది. ఓటర్లు మోకాళ్ల లోతు నీటి లో నడుచుకుంటూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.

● ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే మార్గంలో సుమారు 30 మీటర్ల మేర రహదారి నీట మునిగింది.

● అమలాపురం మండలం ఎ.వేమవరప్పాడు యూపీ పాఠశాల ముంపు బారిన పడటంతో అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని అధికారులు మరోచోటుకు మార్చారు.

● రాజోలు కో ఆపరేటివ్‌ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement