దొంగ ఓట్ల కలకలం
అమలాపురం రూరల్: అమలాపురం మండలం రంగాపురానికి చెందిన నక్కా నాగమణి గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికి ఆమె ఓటు ఎవరో వేసేశారని, ఓటు ఇవ్వలేమని పోలింగ్ అధికారి చెప్పారు. దీంతో, హతాశురాలైన నాగమణి తనకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను వేడుకున్నారు. గ్రామంలో దొంగ ఓట్లు అధికంగా వేశారని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి చేతి వేలికి అప్పటికే సిరా గుర్తు ఉండటంతో ఎన్నికల అధికారులు ప్రశ్నించారని, అతడిని తాము పట్టుకునేలోపే పారిపోయాడని పలువురు చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
రామచంద్రపురం రూరల్: మండలంలోని కందులపాలెంలో 61, 62 పోలింగ్ బూత్‌లు ఉన్న పోలింగ్ కేంద్రానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం, నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్‌రాయ్, అనుచరులు కంచుమర్తి బాబూరావు, వైట్ల గజలక్ష్మి తదితరులు కలసి వెళ్లడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. ఏ అధికారంతో వారు పోలింగ్ కేంద్రం లోపలకు వెళ్లారంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ద్రాక్షారామ పోలీసులు అక్కడకు చేరుకుని మంత్రి తండ్రితో పాటు అందరినీ పంపించేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.


