మండలాలు వర్షపాతం (మి.మీ.ల్లో)
ఆత్రేయపురం 38.2
రామచంద్రపురం 12.6
ఆలమూరు 32.2
రావులపాలెం 35.2
కొత్తపేట 27.8
కె.గంగవరం 17.6
ఐ.పోలవరం 36.8
ముమ్మిడివరం 38.4
అయినవిల్లి 40.0
పి.గన్నవరం 15.6
అంబాజీపేట 23.6
మామిడికుదురు 18.6
రాజోలు 62.6
మలికిపురం 74.8
సఖినేటిపల్లి 70.4
అల్లవరం 16.8
అమలాపురం 27.4
ఉప్పలగుప్తం 34.4
కాట్రేనికోన 24.6
పొలమంతా నీరు.. నీటిలోనే నానుతున్న పనలు.. కళ్లెదుటే కుళ్లిపోతున్న కంకులు.. వెరసి రైతు గుండెల్లో అంతులేని ఆవేదన. పెట్టిన పెట్టుబడి సంగతి దేవుడెరుగు.. కనీసం ఇంటికి నాలుగు బస్తాల ధాన్యమైనా వస్తుందో లేదో తెలియని దుస్థితి. ఒకవైపు అప్పుల భారం.. మరో వైపు పంట నష్టం.. ఇంకోవైపు ప్రకృతి ప్రకోపం.. అన్నదాతను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. నిన్న అర్నబ్, ఇప్పుడు మురసు తీరని నష్టం మిగిల్చాయి.
సాక్షి, అమలాపురం: కళ్లముందే కష్టార్జితం కరిగిపోతుంటే కన్నీరు కార్చడం తప్ప ఏం చేయగలడు ఆ అన్నదాత. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. కుటుంబమంతా శ్రమించి సాగు చేశాడు.. పంట చేతికొచ్చే సమయంలో కోతకు సిద్ధమయ్యాడు. తీరా చూస్తే ప్రకృతి కరుణించలేదు సరికదా... కక్ష గట్టినట్టుగా వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు రైతు జీవితాన్ని ఛిద్రం చేశాయి. నిన్నటి అర్నబ్ పెనుగాలులకు నేలకొరిగిన వరి చేలు.. నేటి మురసు వర్షాలకు మళ్లీ నీట మునిగాయి.
భారీ వర్షం
మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో 34.5 మి.మీ, మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు సగటున 34.1 మి.మీ. వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా భారీ వర్షం పడుతూనే ఉంది. రాజోలు నియోజకవర్గాన్ని వర్షం ముంచెత్తింది. మలికిపురంలో అత్యధికంగా 74.8 మి.మీ., సఖినేటిపల్లిలో 70.4 మి.మీ. రాజోలులో 62.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావానికి గురైన ఈ ప్రాంతాలపై మురసు మరోసారి పంజా విసరడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి.
ముంపులో రోడ్లు, కాలనీలు
భారీ వర్షాలకు అమలాపురం పట్టణంతో పాటు ముమ్మిడివరం, మలికిపురం, రాజోలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు నీట మునిగాయి. అమలాపురంలోని ఈదరపల్లి, భూపయ్య అగ్రహారం ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలికిపురం, రాజోలు ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ల మధ్యకు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
అంధకారంలోనే తీర ప్రాంత గ్రామాలు
అర్నబ్ తుపాను తీవ్రతకు రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ మూడు మండలాల్లో సుమారు 60 గ్రామా లు ఉండగా, ఇప్పటివరకు ఐదారు గ్రామాల్లోని ప్రధాన రహదారులకు మాత్రమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మిగిలిన గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తాజా వర్షాల కారణంగా మంగళవారం విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో విద్యుత్ కష్టాలు మరింత పెరిగాయి. జిల్లాలో ఇంకా పలు గామాలకు విద్యుత్ లేక ఇప్పటికీ తాగునీటి కోసం అలమటిస్తున్నారు.
నీటిలోనే వరి పనలు
జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. అర్నబ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే 1.18 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. గాలులు, వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో నేలవాలిన పనలు నీటిలోనే ఉండిపోయాయి. సాధారణంగా నేలకొరిగిన వరిని నీరు తగ్గిన వెంటనే కోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వారం రోజులుగా ముంపు తొలగకపోవడంతో రైతులకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఈలోగా మురసు మరోసారి ముంచెత్తింది. ఇప్పటికే నీటిలో నానుతున్న చేలపై అదనంగా వర్షపు నీరు చేరింది.
ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం
కొన్ని ప్రాంతాల్లో మూడు అడుగుల మేర నీరు నిలిచింది. కంకులు నీటిలో మునిగిపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువ రోజులు నీటిలోనే ఉంటే గింజలు మొలకెత్తడం, కంకులు కుళ్లిపోవడం, పనలు పూర్తిగా పనికి రాకుండా పోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు ప్రధాన మురుగునీటి కాలువలు కీలకం. అయితే చాలా కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో నీరు వేగంగా దిగే పరిస్థితి లేదు. దీనితో పంట మీద ఉన్న మిగిలిన ఆశలూ సన్నగిల్లాయి.
కె.గంగవరంలో ముంపు బారిన వరిచేలు
కొత్తపేటలో నేలనంటిన వరిని నిలబెడుతున్న రైతులు
చివరి ఆశలపై నీళ్లు
వారం రోజుల వ్యవధిలో
రెండు తుపానులు
పంటలు మునిగి అన్నదాతల ఆవేదన
మరింత పెరిగిన విద్యుత్ కష్టాలు
1.18 లక్షల ఎకరాల్లో
ఇప్పటికే దెబ్బతిన్న వరి
తాజాగా మరింత ముంపు


