సాక్షి, అమలాపురం: గెలుపు ఓటములపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ.. ఎవరి అంచనాలు వారివి.. ఎవరి లెక్కలు వారివి.. అటు అభ్యర్థులు, ఇటు పార్టీల నేతల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన నెలకొన్న వేళ.. ఓట్ల లెక్కింపునకు మరి కొద్ది గంటల్లో తెర లేవనుంది. జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల నుంచి మంగళవారం బయటకు రానుంది. ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత వార్డు కౌన్సిలర్ల ఫలితాలు, ఆ తర్వాత చైర్‌పర్సన్ అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా పుర ప్రజలు, రాజకీయ వర్గాలు, జిల్లా వాసులు సైతం ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉండనున్నదనే విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
మూడు కేంద్రాల్లో..
జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి చేశారు. అమలాపురం మున్సిపాలిటీకి ఎస్‌కేబీఆర్ కళాశాల, రామచంద్రపురం మున్సిపాలిటీకి చింతపల్లి సూరన్న నగర్‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్, ముమ్మిడివరం నగర పంచాయతీకి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు.
అమలాపురంలో..
అమలాపురం మున్సిపాలిటీలోని 36 వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు మూడు గదులు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 4 చొప్పున మొత్తం 12 టేబుళ్లు సిద్ధం చేశారు. కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా నాలుగో గదిని కేటాయించారు. ఇక్కడ ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండులో 12 వార్డుల చొప్పున ఓట్లు లెక్కిస్తారు. మొత్తం మూడు రౌండ్లలో చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.
రామచంద్రపురంలో..
రామచంద్రపురం మున్సిపాలిటీలోని 32 వార్డుల ఓట్ల లెక్కింపునకు మూడు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో 6, రెండో గదిలో 3, మూడో గదిలో 3 చొప్పున టేబుళ్లు సిద్ధం చేశారు. మొదటి గదిలో 1 నుంచి 12 వార్డులు, రెండో గదిలో 13 నుంచి 24 వార్డులు, మూడో గదిలో 25 నుంచి 32 వార్డులకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు.
ముమ్మిడివరంలో..
ముమ్మిడివరం నగర పంచాయతీలోని 23 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు 8 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆరు టేబుళ్లపై కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్లు, మరో 2 టేబుళ్లపై చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. నాలుగు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో రౌండులో ఆరు వార్డుల ఓట్లను లెక్కించి, ఆ వార్డుల కౌన్సిలర్ ఫలితాలతో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను ప్రకటించనున్నారు.
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి పొరపాట్లకూ తావు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో, అప్రమత్తంగా పని చేయాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. కౌంటింగ్ హాళ్లలోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఫలితాల ప్రకటించేంత వరకూ కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.
– ఆర్.మహేష్ కుమార్,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
– అమలాపురం రూరల్
పటిష్ట బందోబస్తు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 480 సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫ్రిస్కింగ్ (దాచి ఉంచిన వస్తువుల గుర్తింపునకు చేసే శరీర తనిఖీ), గుర్తింపు కార్డుల తనిఖీలు, నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఎన్నికల అధికారులు అనుమతించిన వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తాం. అనుమతి లేని వస్తువులు, మొబైల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. కౌంటింగ్ ఏజెంట్లు నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడరాదు. అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు. బాణసంచా కాల్చరాదు. ఘర్షణలకు దారి తీసే చర్యలు, రెచ్చగొట్టే నినాదాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎన్నికల ఫలితాలకు సంబంధించి అసత్య, రెచ్చగొట్టే, విద్వేషపూరిత పోస్టులు, వీడియోలు ప్రచారం లేదా షేర్ చేయరాదు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారితో పాటు సంబంధిత బాధ్యత కలిగిన అడ్మిన్ల పైనా చట్టప్రకారం చర్యలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నందున మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ వేడుకలకు అనుమతి లేదు. ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
అమలాపురంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నాం. ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈదరపల్లి వంతెన నుంచి రాజోలు వైపు వెళ్లే వారు నల్ల వంతెన, ఎర్ర వంతెన, కిమ్స్ కళాశాల, భట్నవిల్లి వై జంక్షన్ మీదుగా వెళ్లాలి. రాజోలు వైపు నుంచి రావులపాలెం, అయినవిల్లి వెళ్లే వాహనాలు పేరూరు వై జంక్షన్, భట్నవిల్లి వై జంక్షన్, కిమ్స్ కాలేజీ, ఎర్ర వంతెన మీదుగా వెళ్లాలి. అమలాపురం పట్టణ, పరిసర ప్రాంతాల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలి.
ముమ్మిడివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరగనున్నందున ఆ ప్రాంతంలోని అన్ని మార్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లేదా కౌంటింగ్ ముగిసేంత వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మార్కెట్ సెంటర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకూ రహదారుల్లో సాధారణ ప్రజలకు, వాహనాలకు అనుమతి ఉండదు. ఆర్టీసీ బస్సులు 216 జాతీయ రహదారి మీదుగా కాశివాని తూము – కొండాలమ్మ చింత – ఎయిమ్స్ కాలేజీ సెంటర్ మీదుగా వెళ్లాలి.
– రాహుల్ మీనా, ఎస్పీ
– అమలాపురం రూరల్
నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు ప్రారంభం
తొలుత కౌన్సిలర్..
ఆ తర్వాత చైర్‌పర్సన్ ఫలితాలు
పూర్తయిన ఏర్పాట్లు
అభ్యర్థుల్లో ఉత్కంఠ


