రామచంద్రపురంలోని పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు
ముమ్మిడివరం: పోలింగ్ బూత్ వద్ద క్యూ కట్టిన ఓటర్లు
సమరం
ముగిసింది..
సాక్షి, అమలాపురం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పుర ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తరువాత గణనీయంగా పెరిగింది. కొత్త ఓటర్ల నుంచి వయోవృద్ధుల వరకూ ఓట్లు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. అయితే, పలుచోట్ల అధికార కూటమి పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఇవే పరిస్థితులు కనిపించాయి. అక్కడక్కడ వాగ్వాదాలు, దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చాయి.
మందకొడిగా మొదలై..
జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం చివరి గంటల్లో ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ కలిపి 72.17 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 91 వార్డుల పరిధిలో 98,035 మంది ఓటర్లుండగా, వీరిలో 70,750 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ముమ్మిడివరం నగర పంచాయతీలో 75.16 శాతం పోలింగ్ నమోదైంది. రామచంద్రపురం మున్సిపాలిటీలో 75.73 శాతం ఓటింగ్ నమోదు కాగా, 71.87 శాతంతో అమలాపురం మున్సిపాలిటీ చివరి స్థానంలో ఉంది.
అమలాపురంలో.. చివరి గంటల్లో..
అమలాపురం మున్సిపాలిటీలో చివరి రెండు గంటల్లో పోలింగ్ ఊపందుకుంది. ముఖ్యంగా 32, 15 తదితర వార్డుల్లో సాయంత్రం 4.30 గంటల సమయంలోనూ ఓటర్లు బారులు తీరారు. మొత్తం 41,079 మంది ఓటర్లకు గాను 29,525 మంది ఓటు వేశారు. పురుషుల్లో 20,068 మందికి 14,582 మంది, మహిళల్లో 21,011 మందికి 14,943 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా ఆరో వార్డులో 85.43 శాతం, అత్యల్పంగా మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన 20వ వార్డులో 57.32 శాతం చొప్పున ఓటింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు 16వ వార్డులో ఓటు వేశారు. 11వ వార్డు నల్లా గార్డెన్స్ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి దూడల వెంకట విరీతాదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్ పోలింగ్ సరళిని పరిశీలించారు.
దొంగ ఓట్ల కలకలం
అమలాపురం 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్దకు వైఎస్సార్ సీపీ, కూటమి నాయకులు ఒకేసారి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కూటమి నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్ సీపీ అభ్యర్థి కట్టోజు పద్మ ఆరోపించారు. ఒకటి నుంచి 10 వార్డుల వరకూ కూటమి నేతలు దొంగ ఓట్లు వేసుకున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
రామచంద్రపురంలో..
రామచంద్రపురం మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో మొత్తం 35,728 మంది ఓటర్లు ఉండగా వీరిలో 25,270 మంది ఓట్లు వేశారు. పురుషుల్లో 17,188 మందికి 12,113 మంది, మహిళల్లో 18,540 మందికి 13,157 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన కుటుంబ సభ్యులు 18వ వార్డు, చైర్మన్ అభ్యర్థులు చింతపల్లి నాగేశ్వరరావు (వైఎస్సార్ సీపీ) 10వ వార్డు, మేడిశెట్టి శేషారావు (టీడీపీ) ఆరో వార్డు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్‌లు ఎన్నికలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.
జనసేన దొంగ ఓట్లపై ఫిర్యాదు
స్థానిక 20వ వార్డులో జనసేన అభ్యర్థికి దొంగ ఓట్లు జోరుగా వేశారంటూ అక్కడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుండుబోగుల రమేష్ మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్ రాజుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొంత మందిని పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిని వదిలేశారని కొన్ని దొంగ ఓటరు ఐడీ కార్డులు బూత్‌లో వదిలిపెట్టి పారిపోయారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముమ్మిడివరంలోనూ జోరుగా..
ముమ్మిడివరం నగర పంచాయతీలో 23 వార్డులకు సంబంధించి 21,228 మంది ఓటర్లు ఉండగాా వీరిలో 15,955 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల్లో 10,406 మందికి 7,878 మంది, మహిళల్లో 10,822 మందికి 8,077 మంది ఓట్లు వేశారు. అత్యధికంగా 19వ వార్డులో 85.47 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 888 మంది ఓటర్లకు గాను 759 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థులు సానబోయిన సునీలాదేవి (వైఎస్సార్ సీపీ) 19వ నంబర్‌పోలింగ్ కేంద్రంలోను, గుబ్బల గంగారత్నభవాని (జనసేన) 14వ నంబర్ పోలింగ్ కేంద్రంలోను ఓట్లు వేశారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలోని 15వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్ట్రాంగ్ రూములకు బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, పోలీసుల భద్రత నడుమ స్ట్రాంగ్ రూములకు తరలించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
అమలాపురం టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ బూత్‌లను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా వేర్వేరుగా పరిశీలించారు. ఒకటో వార్డు పోలింగ్ బూత్‌ను కలెక్టర్ సందర్శించి, ఎన్నికలు జరుగుతున్న తీరుపై పోలింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మీనా 19, 26, 28, 31, 32 పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఓట్లు వేసి, బయటకు వస్తున్న కొంత మంది ఓటర్లతో మాట్లాడి, పోలీసు సేవలపై ఆరా తీశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ కూడా పలు పోలింగ్ బూత్‌ల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు.
మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతాలు
సమయం రామచంద్రపురం అమలాపురం ముమ్మిడివరం
ఉదయం 9.00 13.77 13.45 12.33
11.00 32.39 32.29 28.82
మధ్యాహ్నం 1.00 48.01 49.21 47.03
3.00 61.47 60.61 61.70
సాయంత్రం 5.00 70.73 71.87 75.61
గతం కన్నా తగ్గిన పోలింగ్
అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం
నగర పంచాయతీలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది.
గత మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల వారీగా పోలింగ్ శాతం
పట్టణం 2014 2021 2026
అమలాపురం 77.32 77.73 71.87
రామచంద్రపురం 81.93 73.13 70.73
ముమ్మిడివరం 81.30 81.90 75.61
ముగిసిన మున్సి‘పోల్స్’
జిల్లాలో 72.17 శాతం ఓటింగ్ నమోదు
అత్యధికంగా ముమ్మిడివరంలో
75.16 శాతం
రామచంద్రపురంలో 75.73, అమలాపురంలో 71.87 శాతం
నిబంధనలకు విరుద్ధంగా
బూత్‌లలోకి కూటమి నేతలు
ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నాలు
వాగ్వాదాలు, దొంగ ఓట్ల విమర్శల
నడుమ ముగిసిన పోలింగ్


