వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వినతి
అమలాపురం రూరల్: అమలాపురం పురపాలక సంఘ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి దూడల విరీతాదేవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్వో, మున్సిపల్ ఎన్నికల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ పురపాలక సంఘంలోని 3, 4, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 25, 33 వార్డుల్లో గత అనుభవాల దృష్ట్యా తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించారని, ఎన్నికల రోజున అక్రమార్కులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల లోపల, వెలుపల లైవ్ వెబ్‌కాస్టింగ్ సీసీ టీవీ, నిఘా, మైక్రో అబ్జర్వర్లను నియమించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమరవీరులను స్మరిస్తూ ర్యాలీ
అమలాపురం టౌన్: పోలీసు అమరవీరులను స్మరిస్తూ జిల్లా పోలీసులు అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసులతో పాటు ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీ మహేంద్ర మత్తే, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ వి.పుల్లారావు, అమలాపురం టౌన్ సీఐ పి.వీరబాబు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తుపాను నష్టం పరిశీలన
అమలాపురం రూరల్: జిల్లాలో అర్నబ్ తుపాను కారణంగా పంట, ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని కేంద్ర బృందం రావులపాలెం, అంబాజీపేట, సఖినేటిపల్లి మండలాల్లో పర్యటించింది. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ నిడియాదేవి, ఎస్పీ రాహుల్ మీనా, జిల్లా నోడల్ అధికారి, జిల్లా ఆర్థిక, గణాంక శాఖాధికారి త్రినాథ్ కేంద్ర బృందం వెంట ఉన్నారు. రావులపాలెంలోని సీఆర్‌సీకి చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లాలో జరిగిన నష్టాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. వరి పొలాల్లో నీరు నిలిచిపోవడం, పంటలు నేలకొరగడం, కొబ్బరి, అరటి తోటలు దెబ్బతినడం వంటి పరిస్థితులను తెలిపారు. తీర ప్రాంతాల్లో గృహాలు, మత్స్యకార బోట్లు, ఇతర ఆస్తులకు, విద్యుత్ వ్యవస్థకు వాటిల్లిన నష్టాలను వివరించారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలపై ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం తిలకించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అదనపు కమిషనర్ (ఎక్స్‌టెన్షన్) ప్రశాంత్ అర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గర్గ్ తదితరులు పాల్గొన్నారు.


