ఓటుకు నోటు.. | - | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు..

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

ఫ కూటమి బరి తెగింపు

ఫ కరెంట్‌ తేకుండా కరెన్సీతో

కొడుతున్నారు!

ఫ ఓట్ల కోసం డబ్బులతో పైరవీలు

అమలాపురం టౌన్‌: ఓటుకు నోటు.. ఈ పదం చంద్రబాబుకు తెలిసిందే. ఇది కొత్తేమీ కాదు. మున్సిపల్‌ ఎన్నికల వేళ ఈ అస్త్రాన్ని కూటమి నేతలు ఉపయోగిస్తున్నారు. అసలే తుపాన్‌ ప్రభావానికి జనం విద్యుత్‌ లేక ఇబ్బందులు పడుతుంటే, దీనినే ఆసరాగా చేసుకుని చీకటి రాజకీయాలు చేస్తున్నారు. రాత్రి వేళ చీకట్లో ఓటర్లకు డబ్బు ఎర చూపుతున్నారు. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ శుక్ర, శనివారాల్లో ఓట్ల కొనుగోలుకు కూటమి పార్టీల నాయకులు, అభ్యర్థులు పైరవీలకు దిగారు. తుపాన్‌కు దెబ్బదిన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, నేల కూలిన విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించి మున్సిపల్‌ ఓటర్లకు కరెంట్‌ కష్టాలు తీర్చలేదు గాని, ఓట్లు కొనేందుకు ఓటర్లకు కరెన్సీతో ఎరవేస్తున్నారు. డబ్బుతో ఓటరు దారికి వస్తే సరే సరి.. లేకపోతే కొంతమంది నిరక్షరాస్యులైన ఓటర్లను కూటమికి ఓటు వేయకపోతే మీకు ప్రభుత్వ పథకాలు రావని భయపెడుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో కూటమి నాయకులు పలు వార్డుల్లో ఈ అస్త్రాన్ని ఉపయోగించారు. ఇక్కడ రాత్రి సమయాల్లో ఓటరుకు రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకూ ఇచ్చి ఓట్ల కొనుగోళ్లకు తెరతీశారు. 15వ వార్డులో బలమైన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలని ఓ మంత్రి కంకణం కట్టుకుని, కొంతమంది ఓటర్లకు రూ.6,500 వరకూ ఇచ్చినట్లు సమాచారం. 7, 12, 28, 33, 15, 17 తదితర వార్డుల్లో కూటమి నాయకులు డబ్బులు ఎరచూపినట్లు తెలిసింది. కొందరికి డబ్బుతో పాటు మద్యం అలవాటు ఉన్నవారికి నిబ్‌, పలావు ప్యాకెట్‌ అదనంగా అందించి ప్రసన్నం చేసుకుంటున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీలో 32 వార్డుల్లో కూటమి నాయకులు, అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి ఇచ్చినట్లు తెలిసింది. ముమ్మిడివరం నగర పంచాయతీలో పురుషులకు రూ.వెయ్యి, మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుస్తారనే భయంతో కూటమి నాయకులు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ఓటర్లే చర్చించుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement