చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోతున్నారు

Nov 2 2026 12:11 AM | Updated on Nov 2 2026 12:11 AM

అంబాజీపేట: చంద్రబాబు పాలన, టీడీపీ విధానాలతో ప్రజలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు విసిగి వేసారిపోతూ, వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని ఆ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్‌ ఆధ్వర్యాన ఆదివారం గంగలకుర్రులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యాన టీడీపీలో క్రియాశీలక నాయకులు దూనబోయిన బాబులు, దూనబోయిన నరసింహమూర్తి, పుష్పావతి, రాయుడు లక్ష్మణరావు, రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి శ్రీకృష్ణ, పులపర్తి కమలాధర్‌తో పాటు మరో 50 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి శ్రీనివాసరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అమలు చేయకుండా వంచించిన కూటమి నాయకుల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అబద్ధాలు, మోసాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో సరైన గుణపాఠం చెప్పాలని, వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విత్తనాల దుర్గాభవాని, తరవట్ల అనంతలక్ష్మిలను ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని శ్రీనివాసరావు కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు పి.కె.రావు, ఎంఎం శెట్టి, కాండ్రేగుల శ్రీనివాసరావు, పితాని సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

తుపాను పంట నష్టాలపై

కేంద్ర బృందం పరిశీలన

కాజులూరు: అర్నబ్‌ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం ఆదివారం కాజులూరు మండలంలో పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌ దాస్‌, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ అర్మోరికర్‌, కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హిమాలయ గార్గ్‌, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రణయ్‌గార్గ్‌ ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, జిల్లా వ్యవసాయ, ఆర్థిక గణాంక అధికారులు వీటీ రామారావు, పి.త్రినాథ్‌, తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మండల వ్యవసాయాధికారి వి.అశోక్‌ తదితరులు మండలంలోని వివిధ గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ తుపాను వలన 10 రోజుల్లో చేతికందాల్సిన పంట కళ్ల ముందే నాశనమైందని, కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. తుపాను పంట నష్టాలను ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా వ్యవసాయ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిన

బీసీ యువత

ఆలమూరు: మండలంలో అధికార కూటమి పార్టీలకు చెందిన బీసీ యువ నేత గుత్తుల దుర్గాప్రసాద్‌ నేతృత్వంలో పలువురు యువకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. సంధిపూడిలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వారికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఎంపీటీసీ అభ్యర్థి దొంగ గంగాధర్‌ గెలుపే ధ్యేయంగా తాము పని చేస్తామని ఈ సందర్భంగా బీసీ యువత స్పష్టం చేశారు. చంద్రబాబు జమానాలో పేద, మధ్య తరగతి ప్రజలకు రోజు గడవడమే గగనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి తమ్మన శ్రీనివాస్‌, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తోరాటి గోవిందు, సొసైటీ మాజీ చైర్మన్‌ మోటుపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement