ఇది కె.గంగవరం మండలం శివల పంచాయతీ శివారు ప్రాంతం. అర్నబ్ తుపాను గాలులు, వర్షాల వల్ల ఇక్కడ చేలు నేలనంటేసి, నీట మునిగాయి. ఆరు రోజులుగా నీట నానుతున్నాయి. రైతులు చేలల్లో ఇలా బోదెలు తీసి ముంపునీరు దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. చేలు నీట మునిగి ఉండటంతో ధాన్యం మొలకలు రావడంతో పాటు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మురసు తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట మీద ఆశలు వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు.
చేను కాదు.. మురుగునీటి కాలువే..
ఇది ఉప్పలగుప్తం మండలం పాయకరావు కోడు మీడియం డ్రెయిన్. రెవెన్యూ, మైనర్ డ్రెయిన్ల నుంచి వచ్చే నీరు ఈ డ్రెయిన్ ద్వారా కూనవరం మేజర్ డ్రెయిన్ నుంచి సముద్రంలో కలవాల్సి ఉంది. మీడియం డ్రెయిన్ ఇలా పూడుకుపోవడంతో మిగిలిన డ్రెయిన్ల ద్వారా కూడా నీరు దిగే పరిస్థితి లేదు. వీటిలో పూడికతీతకు నిధులున్నా నీటి సంఘాలు, డ్రైనేజీ శాఖ దృష్టి పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్యమే ఖరీఫ్ వరి చేల ముంపునకు కారణమైంది. ఇదే సమయంలో మురసు తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే ఈ డ్రెయిన్ల వల్లనే పంటలు మొత్తం నాశనం కానున్నాయి.
బోదె తీసినా.. వీడని బాధ


