ఆగని కనీ్నరు | - | Sakshi
Sakshi News home page

ఆగని కనీ్నరు

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

ఒక్క గింజయినా దక్కేనా?: ఉప్పలగుప్తంలో నీట మునిగి నాశనమైన వరి చేలు

నేలనంటి.. నీట నానుతూ..: కె.గంగవరం మండలం కుయ్యేరులో చెరువును తలపిస్తున్న వరి చేను

సాక్షి, అమలాపురం: ప్రచండ గాలులతో అర్నబ్‌ తుపాను కోనసీమను అతలాకుతలం చేసి వారం రోజులు గడుస్తున్నా జనజీవనం ఇంకా కుదుట పడలేదు. తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి జిల్లా ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఒకవైపు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం.. ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం.. ముంపు నుంచి ఇంకా బయటపడని పంట చేలు.. మరోవైపు మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. వెరసి ఈ సీమ ప్రజల కన్నీటికి అంతే లేకుండా పోతోంది. తుపాను వెళ్లిన 24 గంటల్లోనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ, వారం రోజులు దాటుతున్నా ఇప్పటికీ చాలా ప్రాంతాలు అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు విద్యుత్‌ కష్టాలు వెంటాడుతూండగా.. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి.

విద్యుత్‌ కష్టాలు తీరేదెన్నడో?

జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో సైతం పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. ఈ పట్టణాల్లోని ప్రధాన వీధులు, ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్‌ వెలుగులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని 155 గ్రామాలకు సోమవారం రాత్రికి కూడా విద్యుత్‌ సరఫరా లేదు. సరఫరా ఉన్న ప్రాంతాల్లో సైతం పగలంతా కోతలు తప్పడం లేదు. చాలాచోట్ల త్రీఫేజ్‌ విద్యుత్‌ అందుబాటులో లేకపోవడంతో మంచినీటి సరఫరాకు ఉపయోగించే పెద్ద మోటార్లు పని చేయడం లేదు. ప్రజలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ల వద్ద ఆందోళనలకు దిగినా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. రాజోలు దీవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగునీటి కోసం అక్కడి ప్రజలు నానా కష్టాలూ పడుతున్నారు.

ముంపులోనే చేలు..

అర్నబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ముంపులో చిక్కుకున్న వరి చేలను ఇంకా నీరు వీడటం లేదు. పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండటంతో పంటలు నానిపోతున్నాయి. దీనికితోడు అడపాదడపా భారీ వర్షాలు కురుస్తూండటంతో ముంపు సమస్య మరింత తీవ్రమవుతోంది. జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే నేలనంటిన వరి చేలు నీటిలో నానుతూండగా, మరోసారి భారీ వర్షాలు కురిస్తే పంటను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముంచుకొస్తున్న ‘మురసు’

అర్నబ్‌ తుపాను వెళ్లి వారం గడిచినా తీరని కష్టాలతో సతమతమవుతున్న కోనసీమకు తాజాగా మురసు తుపాను ముప్పు మరో పరీక్షగా మారింది. దీని ప్రభావం నేరుగా జిల్లా మీద లేకున్నా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూండటంతో రైతులకు కంటి మీద కునుకు కరువవుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 1.18 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బ తింది. మురసు తుపాను కూడా ప్రభావం చూపిస్తే ఖరీఫ్‌ చేలు నేరుగా దున్ని రబీ సాగు చేయడం మంచిదని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

గుర్రపుడెక్కతో కాలువలు కుదేలు

కోనసీమలోని ప్రధాన మురుగునీటి కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి అధ్వానంగా మారాయి. కూనవరం, వాసాలతిప్ప, శంకరగుప్తం వంటి డ్రెయిన్లు, వాటికి అనుబంధంగా ఉన్న మీడియం, మైనర్‌ డ్రెయిన్లు పూడుకుపోయాయి. గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేయడంలో నీటి సంఘాలు నిర్లక్ష్యం వహించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చేలను ముంపు నీరు వీడటం లేదు.

అర్నబ్‌ వచ్చి నేటికి వారం

ఇప్పటికీ కోలుకోని కోనసీమ

పరామర్శతో సరిపెట్టిన

సీఎం చంద్రబాబు

ఇంకా 155 గ్రామాలకు

అందని విద్యుత్‌ వెలుగులు

పూర్తి స్థాయిలో అందని సేవలు.. తాగునీటికీ కటకట

ఇంకా నీటిలోనే నానుతున్న పంట చేలు

మరోవైపు ‘మురసు’ ముప్పుతో

మళ్లీ భారీ వర్షాలు

ముంపు పెరిగితే రైతు ఆశలు గల్లంతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement