కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు సోమవారం తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఇంటింటికీ వెళ్లి, ఓటర్లను నేరుగా కలసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, ఈ దుష్ట పాలనకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు చరమగీతం పాడాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కె.గంగవరం మండలంలోని గ్రామాల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో కలసి జెడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతా అనురాధ ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
– రావులపాలెం/కె.గంగవరం


