ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

అమలాపురం రూరల్‌: అమలాపురం, ముమ్మిడివరం మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు పి. ప్రశాంతి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి మౌలిక సదుపాయాలు, ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లు, కౌంటింగ్‌ సిబ్బంది విధులు, భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట అమలాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.సరళావతి, ముమ్మిడివరం మున్సిపల్‌ కమిషనర్‌ పి.రవివర్మ ఉన్నారు. అలాగే అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైదియాదేవి పరిశీలించారు.

అమలాపురం టౌన్‌: అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో మంగళవారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లా ఎలక్షన్‌ అథారిటీ, కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పరిశీలించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థులు, వార్డుల అభ్యర్థులకు సంబంధించి అన్ని లెక్కింపు గదులకు వెళ్లి పర్యవేక్షించారు. అలాగే ఎస్పీ రాహుల్‌ మీనా కూడా తనిఖీ చేశారు. వారికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివరాలను అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అథారిటీ, మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌ కుమార్‌ వివరించారు.

ప్రజా కోర్టులో ధర్మమే గెలిచింది

అమలాపురం టౌన్‌: కూటమి నాయకులు కుట్ర చేసినా ప్రజా కోర్టులో ధర్మమే గెలిచిందని, తన భార్య శ్యామలాదేవిని 15వ వార్డులో ఓటర్లు గెలిపించారని వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్‌ (బులినాని) అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 15వ వార్డులో తాను, తన భార్య (డమ్మీ) కౌన్సిలర్‌ అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్లు వేశామన్నారు. కూటమి నాయకులు తనపై కుట్ర పన్ని తన నామినేషన్‌ స్క్రూట్నీ పోయేలా చేశారన్నారు. వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడంతో తనపై కక్షతో నామినేషన్‌ను తొలగించారని ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, అక్కడ న్యాయం గెలిచే అవ కాశం ఉన్నా ఈలోగా ప్రజా కోర్టులో మాత్రం ధర్మమే గెలిచేలా తమ వార్డు ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు. వార్డు ప్రజలకు ఎప్పటికీ తాను, తన భార్య రుణ పడి ఉంటామన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

తుపాను పునరుద్ధరణ

పనుల పరిశీలన

మామిడికుదురు: ఆదుర్రు స్వర్ణ గ్రామ సచివాలయం వద్ద జరుగుతున్న తుపాను పునరుద్ధరణ పనులను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. అర్నబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌, తాగునీటి సరఫరా, పాఠశాల భవనాల మరమ్మతులను బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌లలో విద్యుత్‌ అంతరాయాలు ఉంటే వెంటనే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మరమ్మతులు చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా చూడాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

బెంగళూర్‌, చైన్నె విమాన

సర్వీసుల రద్దు

కోరుకొండ: రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బుధవారం రావాల్సిన బెంగళూర్‌, చైన్నె సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 9 సర్వీసులు రాకపోకలు జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక విమానాశ్రయానికి హైదరాబాద్‌, ముంబయి నుంచి 4 సర్వీసులు మాత్రమే నడిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement