ముంచుకొస్తున్న ముప్పు | - | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

● అతి తీవ్ర తుపానుగా

బలపడనున్న అర్నాబ్‌

● రేపు యానాం సమీపంలో తీరం దాటుతుందని అంచనా

● తీరంలో హై అలర్ట్‌

● నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు

సాక్షి, అమలాపురం: సముద్ర ఉపరితలం మీద నుంచి భీకర తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అర్నాబ్‌ తుపానుగా బలపడి, అతి తీవ్ర తుపానుగా మారి, బుధవారం ఉదయం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రకారం ‘అర్నాబ్‌’.. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో కూడా వీయవచ్చనే హెచ్చరికలు జిల్లా ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో తుపాను ముందు ప్రశాంతత కనిపిస్తున్నా.. తీరం వైపు అది దూసుకొస్తున్నకొద్దీ జిల్లాలోని తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీచే ప్రమాదం పొంచి ఉంది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. మంగళ, బుధవారాలను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు.

రైతుల గుండెల్లో గుబులు

తుపాను హెచ్చరికలు కోనసీమ రైతులను కలవరపెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1.53 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి పంట కోతకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో తుపాను ముప్పు ముంచుకొస్తూండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు నిలిచిపోయి, చేలు కుళ్లిపోతాయని, ధాన్యం రంగు మారి, నాణ్యత దెబ్బ తింటుందని భయపడుతున్నారు. కొబ్బరి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 125 కిలోమీటర్ల వేగంతో వీచే భారీ గాలుల తాకిడికి చెట్లు నేల కూలి, కాయలు రాలిపోయి, మొవ్వులు విరిగిపోయి తీవ్ర నష్టం కలుగుతుందేమోనని కలత చెందుతున్నారు. దీనివలన భవిష్యత్తులో దిగుబడి తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా ఆదాయం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో తుపాన్ల కారణంగా కొబ్బరి తోటలు దెబ్బ తిన్నప్పుడు జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు రైతులు ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి వచ్చింది.

నిలిచిన చేపల వేట

అంతరర్వేది నుంచి ఐ.పోలవరం మండలం బలుసుతిప్ప వరకూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులను నిలిపివేశారు. ఇప్పటికే వేటలో ఉన్నవారిని వెనక్కు రావాలని సూచించారు. సుమారు 2 వేల మెకనైజ్డ్‌ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతర్వేది పల్లిపాలెం, ఓడలరేవు మినీ ఫిషింగ్‌ హార్బర్ల వద్దకు చాలా వరకూ పడవలు చేరాయి. చిర్రయానాం, వాసాలతిప్ప వంటి ప్రాంతాలకు వేటకు వచ్చే విశాఖ జిల్లా నక్కపల్లి మత్స్యకారులను తుపాను షెల్టర్లకు తరలించనున్నారు.

67 తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి

● మొత్తం 67 సముద్ర తీర గ్రామాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. పూరిళ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి, పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైన సహాయక చర్యలకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

● సఖినేటిపల్లితో పాటు పలు రేవుల్లో పంటు, పడవ ప్రయాణాలను నిలిపివేశారు.

● కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైడియాదేవి, ఎస్పీ రాహుల్‌ మీనా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుపానును ఎదుర్కొనేందుకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.

● అమలాపురంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, కొత్తపేటలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.

● విద్యుత్‌ స్తంభాలు కూలిపోయినా, సరఫరాకు అంతరాయం ఏర్పడినా త్వరితగతిన పునరుద్ధరించేందుకు ఇతర జిల్లాల నుంచి 1,500 మంది సిబ్బందిని రప్పించారు.

● కూలిన చెట్లను తొలగించేందుకు జేసీబీలు, పవర్‌ రంపాలను సిద్ధంగా ఉంచారు.

● విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నెల మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

కోనసీమను వణికించిన 1996 పెను తుపాను

అర్నాబ్‌ తుపాను హెచ్చరికలతో కోనసీమ ప్రజలకు 1996 నవంబరు 6న సంభవించిన పెను తుపాను జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ఆ తుపాను అప్పట్లో కోనసీమ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. అమలాపురం, అయినవిల్లి, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, అల్లవరం తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. సుమారు వెయ్యి మంది మృత్యువాత పడగా, లక్షలాది ఇళ్లు దెబ్బ తిన్నాయి. వేలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యాయి. సుమారు 20 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగి, దెబ్బ తిన్నాయన్నది అంచనా. ఇప్పుడు కూడా అర్నాబ్‌ అదే ప్రాంతంలో తీరం దాటనుందని ఐఎండీ చెబుతోంది.

పదేళ్లకోసారి పెను విషాదం పునరావృతమా?

కోనసీమను 1986 నుంచి ప్రతి పదేళ్లకోసారి ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. 1986లో గోదావరి భారీ వరదలు గోదారోళ్లను అతలాకుతలం చేశాయి. తిరిగి పదేళ్లకు అంటే 1996లో పెను తుపాను కోనసీమను కకావికలం చేసింది. ఆ తర్వాత మళ్లీ 2006లో గోదావరి వరదలు ముంచెత్తాయి. 2016లో తుపాను త్రుటిలో తప్పింది. సరిగ్గా పదేళ్ల తర్వాత విధి మళ్లీ అర్నాబ్‌ తుపాను రూపంలో కోనసీమను పరీక్షిస్తోందా అనే ఆందోళన కోనసీమ వాసులను కలవరపరుస్తోంది. గత ఏడాది వచ్చిన మోంథా తుపాను మాదిరిగా ఇది కూడా తీరం చేరేసరికి బలహీనపడితే బాగుండునని కోనసీమ వాసులు దేవుడిని వేడుకుంటున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో...

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌తో పాటు ఆర్‌డీఓ కార్యాలయాల్లో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌ 08856–293104

అమలాపురం ఆర్‌డీఓ 08856–233208

రామచంద్రపురం ఆర్‌డీఓ 08857–245166

కొత్తపేట ఆర్‌డీఓ 08855–244299

పోలీసు సహాయానికి 112

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement