మామిడికుదురు: ఆదుర్రు గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీకి చెందిన విజ్జపు కృష్ణ, జనసేనకు చెందిన తోరం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన ఈ చేరికలు జరిగాయి. కూటమి పాలనపై విరక్తి చెంది తాము వైఎస్సార్ సీపీలో చేరామని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారికి రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి వాసు, మండల బూత్ కమిటీల అధ్యక్షుడు కుసుమ శ్రీను పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగాబత్తుల శ్రీకృష్ణ, ఆదుర్రు ఎంపీటీసీ అభ్యర్థి అంకాడి కోదండలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జీవితం ఆదర్శం
అమలాపురం రూరల్: మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో సోమవారం ఆ మహర్షి చిత్రపటానికి అధికారులతో కలసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, ఏఓ కె.నాగలక్ష్మమ్మ, బీసీ సంక్షేమ శాఖ అధికారి కేఎన్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు
హక్కు నమోదు చేసుకోవాలి
అమలాపురం రూరల్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. ఈ అంశంపై జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


