ఫ రేపటి నుంచి కాకినాడలో నిర్వహణ
ఫ 5 రాష్ట్రాల నుంచి 200 మంది
క్రీడాకారుల రాక
ఫ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షురాలు
సుధారాణి
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): హాకీ ఇండియా సహకారంతో కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా మహిళా సౌత్ జోన్ అశ్మిత హాకీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టోర్నమెంట్ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షురాలు సుధారాణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంగళవారం (ఈ నెల 27) నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్, ఆడిటి అనంతపురం జట్లు పాల్గొంటున్నాయన్నారు. తొలిసారి ఈ పోటీలు కాకినాడలో జరుగుతుండడంతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి, అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. పోటీల నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్‌గా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నిర్వహణ కార్యదర్శిగా ఒలింపియన్ రజని, కమిటీ ఉపాధ్యక్షురాలిగా తాను వ్యవహరిస్తున్నానన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగంలో ప్రతి రోజూ నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డీఎస్‌ఏ హాకీ మైదానంలో పోటీల ప్రారంభ వేడుక జరుగుతుందన్నారు. సమావేశంలో కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, సురేష్ రాజు, సూరిబాబు, దీప్తి ఎస్తేరు, రాజు పాల్గొన్నారు.


