అమలాపురం టౌన్: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలే కూటమి ప్రభుత్వాన్ని దించుతాయని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ 5వ వార్డులో పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి దూడల వెంకట విరీతాదేవి, ఆ వార్డు అభ్యర్థి విత్తనాల మూర్తి, పార్టీ నాయకులతో కలిసి శ్రీకాంత్ ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు తప్ప అమలు చంద్రబాబు ప్రభుత్వంలో లేదన్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థి విరీతాదేవి మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి అవసరాల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సేకరించిన భూమిని నేటి కూటమి ప్రభుత్వం జిల్లా టీడీపీ కార్యాలయానికి కేటాయించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ ఐదో వార్డు ప్రజలే దాదాపు రూ.15 కోట్ల విలువైన సంక్షేమాన్ని డీబీటీ ద్వారా అందుకున్న విషయాన్ని ఓటర్లకు వివరించారు. ఈ ప్రచారంలో పార్టీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్ననాయుడు, ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ శ్రీకాంత్


