సాక్షి, అమలాపురం: జెడ్పీ కుర్చీ కోసం కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి.. ఆ పీఠం మాదంటే మాదంటూ మూడు పార్టీల నేతలు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మొదలైన పోటీ.. ఇప్పుడు కూటమిలోని పార్టీ ల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోంది. టీడీపీలో ఓ వర్గం రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తుండగా, మరో వర్గం ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారికి మద్దతుగా నిలుస్తోంది. మరోవైపు జనసేన నుంచి నగరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గా పనిచేసిన పెనుమాల లక్ష్మి జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ నుంచి మానేపల్లి కృష్ణశ్రీవల్లి కూడా బరిలోకి దిగడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. నలుగురూ ఒకే రిజర్వుడు స్థానం నుంచి పోటీలో ఉండగా.. ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో కూటమి పెద్దల నుంచి స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ 19 జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందంజలో ఉంది. దీంతో అధికార కూటమిలో గెలుపుపై ఆందోళన మొదలైంది.
సమీకరణాలు మారుతూ..
జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన తొలినాళ్లలో రాజోలు టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, రోజులు గడిచేకొద్దీ పార్టీలో సమీకరణాలు మారాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడమే కాకుండా.. జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పిస్తారనే ప్రచారంపై టీడీపీలోని ఓ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. అమూల్యకు మద్దతుగా జిల్లా ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో బలం కనిపించడం లేదనే చర్చ కూడా సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు మాత్రం ఆమెకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ ఎన్నికల వ్యవహారంలో అధిష్టానం స్థానిక ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావనతో పలువురు నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సైతం ఈ వ్యవహారంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమూల్యా అభ్యర్థిత్వానికి పార్టీలో ఏకాభిప్రాయం సాధించడం సవాలుగా మారింది.
ఆమె పేరు కూడా..
టీడీపీ నుంచి చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న వారిలో ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం జెడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారి పేరు కూడా వినిపిస్తోంది. ఆమెకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం.
రేసులో మరో పేరు
కూటమి జెడ్పీ చైర్మన్ రేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తె కొండేటి దేవి ప్రియాంక జనసేన పార్టీ తరఫున మామిడికుదురు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జెడ్పీ చైర్మన్ పీఠం కోసం టీడీపీ, జనసేనల్లో సీనియర్లు, జూనియర్లు సిగపట్లు పడుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా జనసేన పార్టీ తరఫున ప్రియాంక నామినేషన్ వేసిన విషయం వెలుగు చూడటంతో ఆశావహులు కంగుతిన్నారు. జనసేన పార్టీ పెద్దల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ప్రియాంక నామినేషన్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమిలో కుమ్ములాట
జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం కోసం పట్టు
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ
ఎవరి ప్రయత్నాలు వారివి
కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక
క్యాడర్‌లో గెలుపుపై గుబులు
ఆ పదవిని వదులుకుని..
జనసేన తరఫున నగరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి జెడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆమెకు అదే పార్టీకి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మద్దతుగా ఉన్నట్లు సమాచారం. ఈ మద్దతుతోనే ఆమె మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి మామిడికుదురు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసినట్లు ప్రచారం సాగుతోంది.
సమన్వయం లేక..
కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా కుమార్తె మానేపల్లి కృష్ణ శ్రీవల్లి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న అమూ ల్య, పెనుమాల లక్ష్మి, శ్రీవల్లి ముగ్గురూ మామిడికుదురు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై సమన్వయం కనిపించడం లేదు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


