అయినవిల్లి: ఎన్నికల నిర్వహణలో సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి సూచించారు. ఆదివారం అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయాలను సందర్శించిన ఆమె ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఉద్యాన శాఖ జేడీ బి.రమణ, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం తహసీల్దార్లు విద్యాపతి, చిన్నబాబు, శ్రీపల్లవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి దర్శించుకున్నారు.
ఓటరు నమోదు
వేగవంతం చేయండి
అమలాపురం రూరల్: నవంబర్ 6 లోపు ఉపాధ్యాయులంతా ఫారం–19 ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలని డీఆర్‌ఓ సుబ్బారావు సూచించారు. ఆదివారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా, డీఆర్వో సుబ్బారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎన్ మునేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్య వస్తే 1912కు ఫోన్ చేయండి
ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ రాజేశ్వరి
అమలాపురం రూరల్: తుపాను కారణంగా గంటకు 100 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజేశ్వరి తెలిపారు. తుపానుతో విద్యుత్ లైన్లు పడిపోయి సరఫరాకు ఆటంకం కలగవచ్చన్నారు. ఈ విపత్తును ఎదుర్కొని విద్యుత్ ఆటంకాలను నివారించేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. గాలుల తాకిడికి పడిన వైర్లు, స్తంభాలను ప్రజలు గమనించిన వెంటనే దగ్గరలో ఉన్న విద్యుత్ సిబ్బందికి తెలపాలన్నారు. అపార్ట్‌మెంట్, గ్రూప్ హౌస్ ప్రజలు వాటర్ ట్యాంకుల్లో నీరు నింపుకొని, జనరేటర్లు ఉన్నవారు డీజిల్ ఆయిల్ నిల్వ చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా స్థాయి నియంత్రణ నంబర్ 94409 04477, అమలాపురం డివిజన్ నంబర్ 94906 10101, కొత్తపేట డివిజన్ 94931 78821 నంబర్లను సంప్రదించాలని అన్నారు.


