విషాద యాత్ర | - | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● కత్తిపూడి వద్ద నలుగురు భవానీ భక్తులను

కబళించిన కారు

● గన్నవరంలో బస్సు ఢీకొని మహిళ మృతి

● అమ్మవారి దర్శనానికి వెళుతూ మృత్యువాత

భవానీ దీక్ష చేపట్టి, ఎంతో ఉత్సాహంగా విజయవాడకు ప్రారంభమైన వారి యాత్ర విషాదాంతమైంది. టీ తాగుదామని రోడ్డు దాటుతున్న నలుగురు భక్తులను కత్తిపూడిలో కారు రూపంలో మృత్యువు కబళించింది. గన్నవరంలో మరో మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలతో వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

తొండంగి: విజయనగరం జిల్లా డెంకాడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 40 మంది భవానీ దీక్ష చేపట్టి, విజయవాడలో అమ్మవారి దర్శనానికి వెళుతూ గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు బ్రేకులు సరిగ్గా పడటం లేదని భావించిన డ్రైవర్‌ కత్తిపూడి హైవేపై ఏవీ నగరం రహదారి జంక్షన్‌ వద్ద ఒక పక్కగా నిలిపాడు. ఉదయం ఐదు గంటల సమయం కావడంతో నిద్రలో ఉన్న భవానీ భక్తలకు మెలకువకు వచ్చి టీ తాగుదామని బస్సు దిగారు. రోడ్డు దాటుతున్న వారిని కారు వేగంగా ఢీకొనడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. అక్కడే రోడ్డు పక్కన మినీ వ్యాన్‌ను పరిశీలించుకుంటున్న డ్రైవర్‌ చిన్నారావు తీవ్రంగా గాయపడ్డాడు.

పేద కుటుంబాల వారే..

మృతులంతా రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలవారే. వారిలో సిరిగిడి యర్రయ్య కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య లక్ష్మి, కుమారులు కిషోర్‌, లోకేష్‌ ఉన్నారు. లింగాల సీతారామ్‌ (43) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య పైడమ్మ, కుమారుడు సతీష్‌, కుమార్తె లిఖిత ఉన్నారు. తాటిపూడి శివప్రసాద్‌ (35) కూడా ఆటోడ్రైవర్‌గా భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాడు. భార్య రామయమ్మ, ముదినేష్‌, రోహిత ఉన్నారు. బోణెల రమణ సత్తిబాబు (48) కారు డ్రైవర్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మి, సరస్వతి, హేమలత, కుమారుడు వెంకీ ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె హేమలత వివాహం కావాల్సి ఉంది. కుమారుడు వెంకీ చదువుకుంటున్నాడు. ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

కళ్ల ముందే ఘటన

అందరం కలిసి బస్సులో దుర్గమ్మ కొండకు బయలుదేరాం. టీ తాగుదామని బస్సు దిగి నడిచి వెళుతున్న వారిని కారు ఢీకొట్టడంతో కళ్ల ముందే అందరూ చెల్లా చెదురుగా పడిపోయారు. ప్రమాదంతో ఒక్కసారిగా అందరం భయపడ్డాం. మృతుల్లో ఒకరైన యర్రయ్య మా అన్నయ్య, మిగిలిన వారు బంధువులే. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

–సిరిగిడి ఆది, మృతుల బంధువు

మరో ఘటనలో భక్తురాలు

ప్రత్తిపాడు రూరల్‌ (శంఖవరం): ఆ తల్లి అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశించారు. భక్తిశ్రద్ధలతో మాలధారణ చేసి, కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కాలినడకన బయలుదేరిన ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోయిన ఘటన శంఖవరం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాకినాడ జిల్లా శంఖవరం గ్రామానికి చెందిన బోనం అమ్మాజీ (భవానీ భక్తురాలు) విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఈ నెల 15న కాలినడకన బయలుదేరారు. అయితే గురువారం గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న ఆమె కోరిక తీరకుండానే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన అమ్మాజీ కుటుంబం కష్టపడి జీవనం సాగించేది. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితమే కుమార్తెకు వివాహం జరిగింది. కుటుంబానికి అండగా ఉన్న అమ్మాజీ ఆకస్మిక మరణంతో ఆ ఇంట విషాదం అలముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement