అమలాపురం టౌన్: పట్టణంలో జరిగిన దసరా ఉత్సవాల ఊరేగింపుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఉత్సవాలు నిర్వహించే ఏడు వీధుల్లో ఒకటైన రవణం వీధిలోని మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం వద్ద హైదరాబాద్‌కు చెందిన కళాకారులు బుధవారం రాత్రి అగ్నికీలల ప్రదర్శన చేపట్టారు. బోనాల పేరుతో బాటిల్‌లో కిరోసిన్ పోసి, దానిని స్ప్రే చేయడం (వెదజల్లడం) ద్వారా గాల్లో మంటలు రగిలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో స్థానికులైన సందర్శకులు జంగా సుభాష్, రవణం లౌకిక, సలాది భరణి, మోకా సతీష్, తిక్కిరెడ్డి వీరబాబు, చిక్కం శ్రీహర్ష, చిక్కం స్వామినాయుడు, చిక్కం కిట్టు, హైదరాబాద్ బోనాల ఈవెంట్స్ ప్రతినిధి రామదాసు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం పట్టణంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ బోనాల ఈవెంట్స్ కళాకారులు ముగ్గురితో పాటు మరో 17 మంది సందర్శకులు గాయపడ్డారు.
సరదాగా వచ్చి..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13 మందిలో పది మంది సందర్శకులే. దసరా ఊరేగింపులను సరదాగా చూడాలని వచ్చి, ఇలా గాయపడి, ఆస్పత్రి పాలయ్యారంటూ వారి కుటుంబాలు విలపిస్తున్నాయి. పొట్టకూటి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాలు, అగ్నికీలల ప్రదర్శనకు వచ్చిన బృందంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురూ కొన్నాళ్లు ఉపాధి కోల్పోతామంటూ రోదిస్తున్నారు. ఊరేగింపులను చూసేందుకు వచ్చిన బాలిక భరణి శరీరం మొత్తం కాలిపోయింది. చిక్కం స్వామినాయుడు నుదురు, చెంపలు, పెదవులు తీవ్రంగా కాలిపోయాయి. వీరు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిక్కం కిట్టుకు ఓపక్క కాలిపోవడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొంత మందికి పాదాలు, చేతులు, మరి కొంత మందికి ముఖం, ఛాతీ, ఇంకొందరికి శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. బాధితులను రవణం వీధి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆస్పత్రుల్లో పరామర్శించి, ఓదార్చారు.
కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
ముఖం కాలిపోయి చికిత్స
పొందుతున్న స్వామినాయుడు
ఓ బాధితుడి కాళ్లపై కాలిన గాయాలు
ఫ బోనాల ప్రదర్శనలో
చెలరేగిన అగ్నికీలలు
ఫ 10 మంది సందర్శకులు, ముగ్గురు
కళాకారులకు తీవ్ర గాయాలు
ఫ మరి కొంత మందికి స్వల్ప గాయాలు
ఫ ఆస్పత్రికి 13 మంది తరలింపు
ఫ అమలాపురం రవణం వీధిలో దుర్ఘటన


