శ్రీహరి క్షేత్రం.. ఆధ్యాత్మిక వైభవం | - | Sakshi
Sakshi News home page

శ్రీహరి క్షేత్రం.. ఆధ్యాత్మిక వైభవం

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● వైభవంగా ధ్వజారోహణ వేడుక

● దివి నుంచి భువికి దేవతలకు ఆహ్వానం!

● హంస వాహనంపై తిరువీధుల్లో స్వామివారి విహారం

ద్వారకాతిరుమల: చరాచర సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి ధ్వజారోహణ వేడుకను వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఇంద్రాది అష్టదిక్పాలకులు, దేవగణాలు, సప్త అధోలోక జీవులను ఆహ్వానిస్తూ ఈ వేడుక జరిపారు. ఉదయం ఆలయంలో నిత్యహోమాలు, బలిహరణలు, వేదస్వస్తి, సాయంత్రం రుత్విగ్వరణ, అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రాత్రి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ ముఖమండపంలో స్వామివారి కాళీయ మర్దనం అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

శాస్త్రోక్తంగా అంకురార్పణ

తొలుత విష్వక్సేనుడిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అనంతరం అర్చకులు పుట్టమన్నును తెచ్చి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాలికల్లో ఉంచి, వేదమంత్రాల నడుమ నవధాన్యాలను వాటిలో పోశారు. ఆపై సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ నిర్వహించారు. ఈ సందర్భంగా పంపిణీ చేసిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరించారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాల్లో నేడు

ఉదయం 7 గంటలకు

సూర్యప్రభ వాహన సేవ

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ

ప్రత్యేక అలంకారం శకటాసుర వధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement