ఫ జయజయహే మహిషాసుర మర్దిని
కోడ్ ఉల్లంఘిస్తే
కఠిన చర్యలు
అమలాపురం రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, ప్రత్యేక కార్యదర్శి మల్లికార్జున, పోలీస్ ఐజీ రాజకుమారి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం, అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ప్రక్రియను సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, పోలింగ్ పూర్తయ్యేంత వరకూ పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల భద్రతతో పాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోం నైడియాదేవి, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, జెడ్పీ సీఈఓ వసంత మాధవి, డీపీఓ శాంతికుమారి, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ ఆర్‌ఆర్ రాజు పాల్గొన్నారు.
పరిషత్ పోరు షురూ
సాక్షి, అమలాపురం: ఒకవైపు పురపాలక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయ్యి, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరోవైపు గ్రామాల్లో సైతం ఎన్నికల సందడికి తెర లేచింది. పరిషత్ ఎన్నికలకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుండటంతో, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.
దీంతో, జిల్లాలోని 19 మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతూండగా, జెడ్పీ చైర్మన్, ఎంపీపీలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోనున్నారు.
10.90 లక్షల మందికి పైగా ఓటర్లు
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫొటో ఓటర్ల జాబితాను గత నెల 11న ప్రచురించారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను గత నెల 15న, తుది జాబితాను గత నెల 19న విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 10,90,975 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,43,470 మంది పురుషులు, 5,47,489 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలో 19 జెడ్పీటీసీ, 19 ఎంపీపీ, 379 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 1,294 కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 365 సమస్యాత్మక, 319 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు 177 జోన్లు, 392 రూట్లు ఏర్పాటు చేశారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదీ ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల స్వీకరణ : ఈ నెల 21 నుంచి
23 వరకు
నామినేషన్ల పరిశీలన : 24న
అభ్యంతరాల స్వీకరణ : 25న
అభ్యంతరాల పరిష్కారం : 26 నామినేషన్ల
ఉపసంహరణ
తుది జాబితా ప్రచురణ : 27
పోలింగ్ : నవంబర్ 3
ఓట్ల లెక్కింపు : నవంబర్ 5
ఫ నోటిఫికేషన్ విడుదల
ఫ రేపటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ
ఫ జిల్లాలో 19 ఎంపీపీలు, 19 జెడ్పీటీసీలు
ఫ ఎంపీటీసీలు 379


