మలికిపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి కీలక వికెట్ పడింది. తమ కంచుకోట అని ఆ పార్టీ చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేన విజయానికి విశేష కృషి చేసిన సీనియర్ నాయకుడు ఆరేటి మురళీకృష్ణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ మలికిపురం మండల అధ్యక్షుడు మల్లిపూడి సత్తిబాబుకు తెలిపానని పేర్కొన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని తన ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మురళి ఈ విషయం తెలిపారు. జనసేన అభివృద్ధికి 2009 నుంచీ అహర్నిశలూ పని చేశామని, ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు తనకు నచ్చడం లేదని అన్నారు. జనసేన నిర్ణయాలు కూడా సరైనవి కాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు.
ఫ్లెక్సీల తొలగింపు
మామిడికుదురు: ప్రభుత్వ ప్రైవేటు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తదితర రాజకీయ పార్టీల నేతల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను మగటపల్లి, కొమరాడ గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఎట్టకేలకు సోమవారం తొలగించారు. ‘ఎన్నికల కోడ్‌కు తిలోదకాలు’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మగటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐరన్ గ్రిల్స్‌తో పాటు కార్యాలయం ప్రాంగణం, ఎదురుగా ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. కొమరాడతో పాటు ఇతర గ్రామాల్లోని పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీలనూ తొలగించారు.
కోకో ఫెడ్‌కు నూతన అడ్వైజరీ కమిటీ
అమలాపురం టౌన్: కోనసీమ కన్జూమర్స్ ఫెడరేషన్(కోకో ఫెడ్)కు నూతన అడ్వైజరీ కమిటీ ఏర్పాటైంది. కోకో ఫెడ్ చైర్మన్ అరిగెల బలరామమూర్తి అధ్యక్షతన స్థానిక జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంలో జిల్లాలోని వివిధ మండలాల వినియోగదారుల ప్రతినిధుల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి ప్రధాన కార్యదర్శిగా బీవీవీ సత్యనారాయణ; వైస్ చైర్మన్లుగా మాలే శ్రీనివాస్, నగేష్, మెర్ల శాస్త్రులు, జీవీఎల్‌ఎన్ శర్మ; కార్యదర్శులుగా ఎస్.ఉషారాణి, బి.హనుమంతరావు; లీగల్ అడ్వయిజర్‌గా పి.సూర్యప్రకాశరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 24న జరగబోయే అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. దివంగత డీఎస్‌ఓ ఉదయ భాస్కర్ మృతికి సమావేశం సంతాపం తెలిపింది.


