ఆత్రేయపురం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం వివక్ష చూపుతోంది. ఆత్రేయపురం మండల రిటర్నింగ్ అధికారిగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వీఆర్ రుద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులైన తహసీల్దార్ ఆర్‌డీ రామచంద్రమూర్తి, ఎంపీడీవో పీవీఆర్‌కే రాజు, ఎస్సై ఎస్.రాము, గ్రామ సచివాలయాలకు సంబంధించి డిప్యూటీ ఎంపీడీవో కె.రమేష్‌బాబు తదితరులు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సిందిగా గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ, ఆ ఆదేశాలు మాత్రం ఆచరణకు దూరంగానే ఉన్నాయి. ర్యాలి వంతెన సమీపాన అధికార కూటమికి చెందిన భారీ ఫ్లెక్సీలు కళ్ల ముందే కనిపిస్తున్నా అలాగే వదిలేశారు. కానీ, కక్ష కట్టినట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిన్నపాటి విగ్రహానికి మాత్రం ముసుగు వేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బొబ్బర్లంక – మెర్లపాలెం రాష్ట్రీయ రహదారిపై అనేకచోట్ల టీడీపీ ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి. లొల్ల ఆంజనేయస్వామి విగ్రహం సమీపాన ఉన్న భారీ ఫ్లెక్సీలు ఇప్పటి వరకూ తొలగించలేదు. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ మాడవీధుల్లోని రెండు ఫ్లెక్సీల తొలగింపులో అధికారులు అలసత్వం చూపుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఎన్నికల కోడ్‌ను ఎటువంటి వివక్షా లేకుండా అమలు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


