అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (బులినాని) స్థానిక 15వ వార్డుకు వేసిన నామినేషన్‌ను అధికారులు సోమవారం ఏకపక్షంగా తిరస్కరించడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. వివరాలివీ.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను అధికారులు సోమవారం చేపట్టారు. ఈ నేపథ్యంలో 15వ వార్డుకు నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి దండుమేను రూపేష్ ఓ కారు కొనుగోలుకు సంబంఽధించి రూ.వెయ్యి బకాయి ఉన్నారంటూ బులి నాని ఫిర్యాదు చేశారు. దీనిపై సహాయ ఎన్నికల అధికారి అయిన మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌తో కూటమి నేతలు చర్చించారు. అనంతరం, 2019లో అమ్మేసిన ఓ భూమిని కొన్న వ్యక్తి తన పేరున మార్చుకోని కారణంగా బులినాని మున్సిపాలిటీకి రూ.61 వేల బకాయి ఉన్నారంటూ కమిషనర్ ఓ కాగితం చూపించారు. అయితే, అదే కమిషనర్ మున్సిపాలిటీకి బకాయిలేవీ లేరంటూ బులినానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వడం గమనార్హం. దీంతో, కమిషనర్ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. కూటమి నాయకులతో కుమ్మక్కయ్యారని, అందువల్లనే బులినాని నామినేషన్ తిరస్కరించారని దుయ్యబట్టారు. కాగా, 2021, 2023 సంవత్సరాల్లో తాను అమ్మేసిన భూమికి బకాయిలు చూపిస్తున్నారని, దీనిని సరి చేయాలంటూ మున్సిపల్ ఆర్‌ఐల దృష్టికి పలుమార్లు తీసుకుని వచ్చానని బులినాని చెప్పారు. ఇందులో తన తప్పు లేదని స్పష్టం చేశారు. తొలుత బకాయిలు లేవని ఎన్‌ఓసీ ఇచ్చిన కమిషనరే ఇలా అడ్డం తిరిగి 2019లో బకాయి ఉన్నారని చెప్పడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బులి నాని నామినేషన్ తిరస్కరణ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ మున్సిపల్ ఆఫీసుకు చేరుకుని బులినానికి మద్దతుగా నిలిచారు.
బులినాని భార్య నామినేషన్ పదిలం
కాగా, బులినానికి డమ్మీగా వేసిన ఆయన భార్య శ్యామలాదేవి నామినేషన్‌పై కూడా కూటమి నేతలు కుట్రలు చేశారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో దానిని అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. కూటమి నేతలు అభ్యంతరం చెప్పే సమయానికి గడువు ముగియడంతో అధికారులు ఆమె నామినేషన్ జోలికి వెళ్లలేదు.
ప్రశ్నించే గొంతును నొక్కాలనే తొలగింపు డ్రామా
బులినాని నామినేషన్ తిరస్కరణ విషయం తెలియడంతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెంటనే అమలాపురం చేరుకున్నారు. సాయంత్రం కలెక్టరేట్‌కు వెళ్లి, కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నైడియాదేవిని కలిశారు. బులినాని నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని ఫిర్యాదులు చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. అనంత రం జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ, మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రశ్నించే గొంతును ముందుగానే నొక్కే దురుద్దేశంతోనే బులినాని నామినేషన్ తిరస్కరణకు డ్రామా ఆడారని ధ్వజమెత్తారు. అమలాపురం తాగునీటి రిజర్వాయర్‌కు చెందిన రెండెకరాల భూమిని జిల్లా టీడీపీకి ఇవ్వడానికి బులినాని అభ్యంతరం చెప్పారని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దొడ్డిదారిన నామినేషన్ తిరస్కరణతో కౌన్సిల్‌కు రాకుండా కుట్ర పన్నారని దుయ్యబట్టారు. కూటమి నేతలతో కుమ్మక్కయిన మున్సిపల్ కమిషనర్ సహా ఇందులో భాగస్వాములైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ, బులినాని నామినేషన్ తిరస్కరించిన ఈ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, పార్టీ బీసీ, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్దుల్ ఖాదర్, మున్సిపల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొవ్వాల రాజేష్ పాల్గొన్నారు.
ఫ బులినాని నామినేషన్ తిరస్కరణ
ఫ మున్సిపాలిటీకి బకాయి ఉన్నారన్న కమిషనర్
ఫ బులినానికి నోఓసీ ఇచ్చిన అదే కమిషనర్
ఫ ఆయన తీరుపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం
ఫ అమలాపురం మున్సిపల్
కార్యాలయంలో ఉద్రిక్తత
ఫ మున్సిపల్ కమిషనర్ సహా అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్
ఫ కలెక్టర్‌కు ఆ పార్టీ నేతల ఫిర్యాదు
ఫ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటన


