సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లాలోని గోదావరి నదీపాయల్లో వరద పోటు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం, శబరి పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో.. బ్యారేజ్ గేట్లు ఎత్తివేసి దిగువకు పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తున్నారు. కోనసీమపై సోమవారం ఉదయం నుంచి వరద ప్రభావం కనిపించనుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద సుమారు సాయంత్రం ఆరు గంటల సమయంలో 6.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. రాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కోనసీమలోని గోదావరి పాయల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముంది.
లంకలకు ముంపు ముప్పు..
వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి గోదావరి పాయల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. అన్నంపల్లి, పి.గన్నవరం అక్విడెక్టుల వద్ద వరద నీరు ఉరకలేస్తోంది. ఐ.పోలవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, మామిడికుదురు, కె.గంగవరం తదితర మండలాల్లో గోదావరి పాయల మధ్య ఉన్న లంక గ్రామాలను ఆనుకుని వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రధాన గ్రామాలకు ముంపు ప్రమాదం లేకపోయినా.. వరద మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల్లోకి, కొబ్బరి తోటలు, ఇతర వ్యవసాయ భూముల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముమ్మిడివరం మండలంలోని ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అయినవిల్లి మండలంలోని కొండుకుదురులంక, కె.గంగవరం మండలంలోని శేరులంక తదితర లంక గ్రామాల్లోని లోతట్టు తోటల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ఉధృతి మరింత పెరిగితే రేవుల వద్ద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే కోటిపల్లి–ముక్తేశ్వరం రేవును మూసివేశారు. పరిస్థితిని బట్టి మరికొన్ని రేవుల్లో పడవ ప్రయాణాలను నిలిపివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కనాయిలంక కాజ్‌వే మునిగే అవకాశం
పి.గన్నవరం సరిహద్దులో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కనాయిలంక కాజ్‌వే ఆదివారం రాత్రికి వరద నీటిలో మునగనుంది. భద్రాచలం వద్ద ఉదయం 11 గంటల సమయానికి వరద 8.68 లక్షలుగా ఉంది. దీనికి శబరి వరద తోడైంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక వరకు వరద పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరిగితే పరిస్థితిని బట్టి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.
మూడు రోజుల్లో 121.87 టీఎంసీలు
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి మిగులు జలాల విడుదల 24 నుంచి 27 వరకు 121.876 టీఎంసీలుగా ఉంది. 24న 1,145.278 టీఎంసీలుగా ఉన్న మిగులు జలాలు 27 నాటికి 1,267.154 టీఎంసీలకు చేరాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మరింత పెరుగుతున్న నేపథ్యంలో కోనసీమలో గోదావరి పాయల ఉధృతి కూడా క్రమంగా పెరుగుతోంది.
నెమ్మదిగా పెరుగుతున్న గోదావరి
ప్రస్తుతం 6.30 లక్షల క్యూసెక్కులు
రాత్రికి 8 లక్షలకు చేరువలో
ఎగువన భద్రచలం..
శబరికి పెరుగుతున్న వరద
కోనసీమ జిల్లాపై
సోమవారం ఉదయం నుంచి ప్రభావం
మూడు రోజుల్లో
సముద్రంలోకి 121.15 టీఎంసీలు


