అమలాపురం టౌన్: స్థానిక మహిపాలవీధిలోని మున్సిపల్ పాఠశాల హెచ్‌ఎం మలిశెట్టి మూర్తి (ఎంఎస్‌ఎన్ మూర్తి)కి చెందిన రెండస్తుల డాబా ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున విస్ఫోటం సంభవించి ఇంటిపై అంతస్తు 50 శాతం దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన మూర్తి పెద్ద కుమారుడు సాయిరామ్‌ను వైద్యం కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సుమారు రూ.10 లక్షల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్ని మాపక సిబ్బంది అంచనా వేశారు. డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సీఐ పి.వీరబాబు ఘటన స్థలాన్ని, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. పై అంతస్తు గదులను పూర్తిగా మూసివేయడం వల్ల ఇంట్లోని ఇన్వెర్టర్ బ్యాటరీ పేలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల సమీపంలో ఉన్న సగం వాడి వదిలేసిన సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఈ పేలుడు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంటిలో పేలుడు పదార్థాలేవీ లేవని ఆయన తెలిపారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించి రాజమండ్రి రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. తెల్లవారు జాము 4.45 గంటలకు ఇంటి పై అంతస్తులో పెద్ద శబ్దం వచ్చిందని, పిడుగుపాటు వల్ల ఈ పేలుడు జరిగి ఉండవచ్చని ఇంటోని వారు చెప్తున్నారు. కానీ ఆ సమయంలో అటువంటి వాతావరణ పరిస్థితి ఏమీ లేదని పోలీసులు తెలిపారు.
పరుపు నుంచి మంటలు
పై అంతస్తులో మూర్తి ఇద్దరి కుమారులు నిద్రిస్తుండగా మంచంపై పరుపు నుంచి మంటలు వ్యాపించడం, శ్లాబ్ సీలింగ్ ఊడి పడడం, గోడలు, కిటికీలు, తలుపులు దెబ్బతినడండో పెద్ద కుమారుడు సాయిరామ్ కంగారు పడి పక్క ఇంటివైపు దూకేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నాడు. ఈ ఘటనతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరుగుతోందో తెలియక బాధిత కుటుంబం, ఇరుగుపొరుగువారు అయోమయానికి గురయ్యారు. సాయిరామ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని, ఫైర్ సిబ్బంది కూడా కొద్ది సేపటికి వచ్చి పరుపు నుంచి వచ్చిన మంటలను అదుపు చేశారని స్థానికులు తెలిపారు.
50 శాతం మేర దెబ్బతిన్న పై అంతస్తు
రూ.10 లక్షల ఆస్తి నష్టమని అంచనా
ఇన్వెర్టర్ బ్యాటరీ పేలడం..
విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించి ఖాళీ సిలిండర్ సైతం పేలినట్టు చెప్తున్న బాధితులు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు


