గోదావరిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు! | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గల్లంతు!

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

ఒడ్డున లభ్యమైన పాదరక్షలు, వస్తువులు

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తాళ్లపూడి: స్నేహితుడిని కలసి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, తాళ్లపూడి పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బల్లిపాడు గ్రామానికి చెందిన పెండ్యాల జ్యోతి స్వరూప్‌కుమార్‌ (25) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం వేగేశ్వరపురంలో ఉన్న తన స్నేహితుడిని కలసి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. ఈ క్రమంలో బల్లిపాడు గోదావరి రేవు వద్ద కొద్దిసేపు గడిపిన స్వరూప్‌ గోదావరి అందాలను వీడియో తీసి, దానికి పాటను జోడించి తన వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. దానిని పలువురు స్నేహితులు సైతం వీక్షిచారు. కొద్ది సేపటికే అతని జాడ తెలియకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తాళ్లపూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై టి.రామకృష్ణ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ స్వరూప్‌ వేసుకున్న చెప్పులు ఒడ్డున ఉండగా, అతని ఫోన్‌ మరో చోట ఉంచడాన్ని గుర్తించారు. ప్రమాద వశాత్తు గోదావరిలో పడి గల్లంతై ఉంటాడని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, మత్స్యకారులు గాలింపు చేపట్టారు. స్వరూప్‌ ఆ కుటుంబంలో రెండో కుమారుడు. కాగా పెద్ద కుమారుడు, కుమార్తె కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగానే స్థిరపడ్డారు. స్వరూప్‌ ఆచూకీ తెలియకపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా ప్రదేశాన్ని తహసీల్దార్‌ లక్ష్మీ లావణ్య, రెవెన్యూ స్బింది, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement