కాకినాడ రూరల్: ఆంధ్ర కాపు సద్భావన సంఘం తాత్కాలిక నూతన అధ్యక్షుడిగా ముమ్మడి సత్యనారాయణను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని శుభం కాపు కల్యాణ మండపంలో ఈ ఎన్నిక నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు బసవ ప్రభాకరావు, చిట్నీడి శ్రీనివాస్, సలాది మూర్తి మాట్లాడుతూ కాపు సద్భావన సంఘం ఆంధ్ర సద్భావన సంఘంగా మారిందన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సభ్యులు రంగనాయకులు, రెడ్నం రాజా, కొప్పిశెట్టి శ్రీను, గంగిరెడ్డి మూర్తి, జంక్షణ బాబ్జీ, అడపా ప్రకాశరావు పాల్గొన్నారు.
చెస్‌లో గీతాశ్రీ ప్రతిభ
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో యూరోకిడ్స్‌లో అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. విజేతలలో ఒకరిగా నిలచిన కోనసీమ జిల్లాకు చెందిన కొట్టాల గీతశ్రీకి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిశోర్ రూ.30 వేల నగదు బహుమతి అందజేశారు.
ఉత్సాహంగా
అంతర్ రాష్ట్ర కరాటే పోటీలు
అమలాపురం రూరల్: మండలంలోని సమనస ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పవర్ కిక్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో అంతర్ రాష్ట్ర ఇన్విటేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్–2026 పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 900 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. విజేతలకు ఏఎస్పీ ఎం.మహేంద్ర, పాఠశాల డైరెక్టర్ నంద్యాల మనువిహార్ పతాకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
విద్యుదాఘాతంతో
ఐదు గేదెలు మృతి
రైతుకు న్యాయం చేస్తామన్న ఏడీఈ
కాట్రేనికోన: మండలం చిర్రయానం రోడ్డులో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఆదివారం ఐదు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ ఘటనతో వాటి యజమాని, రైతు పాలెపు రామకృష్ణకు రూ.8 లక్షలు నష్టం వాటిల్లింది. చిర్రయానం–గచ్చకాయల పోర సరిహద్దు వద్ద మేతకు వచ్చిన గేదెలలో ఒక గేదె కొమ్ములు ఆ తీగలకు తగలడంతో మృతి చెందింది. మిగిలిన గేదెలు చనిపోయిన గేదెను వాసన చూస్తూ తాకడంతో అవి కూడా మృతి చెందాయి. వాటిని చూసిన రైతు భోరున విలపించాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏడీఈ డి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని రైతుకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సముద్ర తీరం వెంబడి వీచే తీవ్రమైన గాలుల వల్ల స్తంభాలు ఒరిగిపోవడం, విద్యుత్ తీగలు తెగి వేలాడుతుంటాయని, ఈ ప్రమాదాలను అరికట్టేందుకు కవర్ కండక్టర్ కేబుల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఏడీఈ తెలిపారు.


