● రెండేళ్లుగా అమలు కాని ‘నేతన్న నేస్తం’
● చంద్రన్న ప్రభుత్వంలో అమలుకు గ్రహణం
● సహకార సంఘాలకు తీరని బకాయిలు
● నేడు జాతీయ చేనేత దినోత్సవం
లబ్ధిదారుల సంఖ్య
తగ్గిస్తే అన్యాయమే
ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలి రెండేళ్లు రూ.25 వేల సాయం అందిస్తామని చెప్పి నేతన్న సేవా పథకం అమలు లేదు. ఇప్పుడు ఇస్తామంటున్నప్పటికీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారన్న ఆందోళన ఉంది. అదే జరిగితే నేతన్నలకు అన్యాయం చేసినట్టే అవుతుంది.
–ముప్పన వీర్రాజు,
మాజీ ఆప్కో డైరెక్టర్, పెద్దాపురం
కపిలేశ్వరపురం: సంప్రదాయ కళకు ఆదరణ కరవైంది.. చేనేత మగ్గం కష్టాల్లో మగ్గిపోతోంది.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ‘నేతన్న నేస్తం’ పథకం రెండేళ్లుగా ఆ కార్మికులకు దూరమైంది.. ఇప్పటికే ఆధునికత నేపథ్యంలో చేనేత వస్త్ర పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మగ్గాన్ని నమ్ముకుని సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న చేనేతలకు సహకారం లేకపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 24 వేల చొప్పున ఐదేళ్లూ సాయమందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.25 వేల అందిస్తామని చెప్పి, తొలి రెండేళ్లూ ఎగ్గొట్టింది. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
గతమెంతో ఘనం అనే నానుడి చేనేత కార్మికులకు సరిగ్గా సరిపోతుంది. 2019 డిసెంబర్ 21న నేతన్న నేస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. పాలనాకాలం ఇంకా పది నెలల కాలం ఉండగానే హామీ తాలూకు ఐదు విడతల సాయాన్ని అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదేళ్లూ రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఐదేళ్ల సాయం ఇలా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,256 కుటుంబాలకు రూ.47.13 కోట్లు, కాకినాడ జిల్లాలో 2,778 కుటుంబాలకు రూ. 31.58 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 916 కుటుంబాలకు రూ.10.21 కోట్లు మొత్తం ఉమ్మడి జిలాలో రూ. 88.94 కోట్ల సాయం అందజేశారు. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశారు. చేనేత ప్రత్యేక పథకాలతో పాటు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, తదితర పథకాలు నేతన్న కుటుంబాలకు పలు విధాలా భరోసాగా నిలిచాయి.
ఉమ్మడి జిల్లా ఉద్యమాలతో...
చేనేత సంఘాల బకాయిలు చెల్లించాలని, 2018 జీఓ ప్రకారం కొనుగోలు చేసే నూలుపై 40 శాతం, వస్త్రాల అమ్మకాలపై 30 శాతం డిస్కౌంట్ చెల్లించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నేతన్నలు ఉద్యమించారు. 2025 సెప్టెంబర్, అక్టోబర్‌లలో అంగరలో రిలే దీక్షలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న మంగళగిరిలో చేనేత గర్జన పేరుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగస్తులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి జిల్లా వ్యాప్త నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. చేనేత వృత్తిదారుని కుటుంబానికి రూ.200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది. నేతన్నల సేవా పథకం ద్వారా రూ.25 వేలు ఇస్తామన్న హామీ అమలు చేయబోతున్నామంటూ ప్రకటన ఇచ్చింది.
రెండేళ్ల పాలనలో దగా
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా చేనేతల కోసం చేసిందేమీ లేదు. మగ్గం వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కార్మికులను కనీసం పట్టించుకోలేదు. గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఏటా రూ.25 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తామే దగాకు గురయ్యామని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీ ఇచ్చి.. అమలు మరిచి
ప్రభుత్వం, ఆప్కో సంస్థల నుంచి తమ సంఘానికి రావాల్సిన సుమారు రూ.3.85 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్, అక్టోబర్‌లలో 14 రోజులు పాటు అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానంటూ జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న నిరసన శిబిరానికి స్వయంగా వచ్చి దీక్షను విరమింపజేశారు. పాక్షిక చెల్లింపులు తప్ప నేటికీ బకాయిలు అలానే ఉన్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేనేత పరిశ్రమ ఇలా...
అంశం తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ మొత్తం
చేనేత సంఘాలు 16 18 16 50
చేనేత మగ్గాలు 1,510 2,809 4,570 8,889
చేనేత కార్మికులు 3,890 4,430 8,010 16,330


