● హాస్టళ్లలోకి మీడియా,
ప్రజా సంఘాలకు నో ఎంట్రీ
● సాంఘిక సంక్షేమ శాఖ
సర్క్యులర్‌పై విమర్శలు
ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించరాదంటూ జారీ చేసిన సర్క్యులర్‌ని వెంటనే రద్దు చేయాలి. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం కోసం పోరాడడం విద్యార్థి సంఘాల రాజ్యాంగబద్ధమైన హక్కు. అలాంటి హక్కులను కాలరాస్తూ విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. హాస్టళ్లలో ఆహారం, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలపై పర్యవేక్షణ చేసే హక్కు ప్రజాస్వామ్య సంఘాలకు ఉంది. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో మొన్న భోజనంలో బొద్దింకలు కనిపిస్తే ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
–ఎస్.కిరణ్‌కుమార్,
పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పారదర్శకతకు పాతరేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో లోపాలను గుర్తించే అవకాశం లేకుండా, ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్ ఉంది. ఇటీవల ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల లేమి, ఆహార నాణ్యత లోపం, విద్యార్థుల అనారోగ్యం వంటి ఘటనలు ప్రభుత్వ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. వాటిని మీడియా, విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు వెలుగులోకి తెస్తుండటంతో, కలవరపడిన ప్రభుత్వం ఏకంగా హాస్టల్‌లోకి నో ఎంట్రీ అని సర్క్యులర్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలపడుతోంది. హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, గోప్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని, ఆ పేరుతో మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా వాటిలోకి వెళ్లకూడదనే ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్య పర్యవేక్షణను అడ్టుకోవడమేననే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను అడ్డుపెట్టుకుని హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కుల వివక్ష, అవినీతి, నాసిరకం ఆహారం, మౌలిక వసతుల లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు బయటపడకుండా చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిధులతో నడిచే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరును పర్యవేక్షించి ప్రశ్నించే అధికారం మీడియాకు, ప్రజలకు ఉందనే స్పృహను ప్రభుత్వం విస్మరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఉత్తర్వుల్లో ఏముందంటే..
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోకి అనధికార వ్యక్తులు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ సంఘాల నాయకులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమ ప్రతినిధులకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఆయా వసతి గృహాలను సందర్శించాలంటే జిల్లా కలెక్టర్‌తో ముందస్తు లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.


