పంట కాలువలో పడి కౌలురైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పంట కాలువలో పడి కౌలురైతు మృతి

Aug 7 2026 12:14 AM | Updated on Aug 7 2026 12:14 AM

కాజులూరు: పంట కాలువలో పడి ఓ కౌలురైతు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కోలంకకు చెందిన బండారు శ్రీనివాస్‌ (37) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు రాత్రి సమయంలో పొలానికి వెళ్లి క్షుణంగా పరిశీలించగా, శ్రీనివాస్‌ పొలాల మద్య ఉన్న పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే అతను మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గొల్లపాలెం ఇన్‌చార్జ్‌ ఎస్సై ఆర్‌వీఎస్‌ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి మృతదేహం

లభ్యం

జగ్గంపేట: భావవరం గ్రామంలోని ఏలేరు నదిలో స్నానానికి దిగి గల్లంతైన వడ్డి ప్రశాంత్‌ కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వెలికి తీయించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఈ ఘటనతో విహార యాత్రకు వచ్చిన విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి కొద్దికాలం కిందట మరణించగా, అతని తల్లి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉన్నారు. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిప్లమో చేస్తున్నాడు.

మోటారు సైకిళ్ల ఢీ

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కాట్రేనికోన: మండలంలోని ఎస్‌.సావరం సమీపంలో మహిపాల చెరువు –పల్లంకుర్రు ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొట్టుకోవడంతో గెద్దనాపల్లి పంచాయతీ బక్కివారిపేటకు చెందిన చిల్లా కుమార్‌ (35) మృతి చెందాడు. అలాగే మరో మోటారు సైకిల్‌పై ఉన్న పల్లంకుర్రు శివారు లైన్‌పేటకు చెందిన ఇసుకపట్ల హరి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన హరిని 108 అంబులెన్స్‌లో అమలాపురం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాట్రేనికోన ఎస్సై ఐ.అవినాష్‌ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

కారు, లారీ ఢీ

శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై గురువారం లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. రాజమంద్రవరం నుంచి వస్తున్న కారు, వైజాగ్‌ నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు డివైడర్‌ను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు తప్ప ఎటువంటి ప్రమాదం జరగనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులను వివరాలు అడగగా, ఎటువంటి సమాచారం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement