రాజానగరం: యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు ఎటువంటి నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేస్తూ ఆదికవి నన్నయ వర్సిటీలోని ఔట్ సోర్సింగ్ బోధనేతర సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమకు అన్యాయం జరిగేలా ఈనెల 1న విడుదల చేసిన టెండర్ నోటీసును తక్షణమే రద్దు చేయాలన్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు రిలే దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేశారు.


