జగన్‌ హయాంలో సంక్షేమం.. చంద్రబాబు పాలనలో సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలో సంక్షేమం.. చంద్రబాబు పాలనలో సంక్షోభం

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

కొత్తపేటలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు

రెండేళ్లు’ కార్యక్రమం

కొత్తపేట: రాష్ట్రంలో నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమంతో నిత్యం పండగ చేసుకున్న ప్రజలు, నేడు చంద్రబాబు పాలనలో సంక్షోభం రాజ్యమేలుతుండగా ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గ కేంద్రం కొత్తపేట వాసవీ కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పాటి శివకుమార్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బ్లాక్‌ బెలూన్లు ఎగురవేసి నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, సంక్షేమ పథకాల కోతలను ప్రజలకు వివరించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రగ్రహణం నడుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సమాధి కట్టిందన్నారు. మెగా డీఎస్సీ పేరుతో దళిత, బీసీ, మైనారిటీ యువతకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

12న భారీ ర్యాలీ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆరోగ్యశాఖ వైఫల్యాలు, మహిళలపై పెరుగుతున్న దారుణాలు, దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు, నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో మోసం చేయడం, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం వంటి అంశాలను తూర్పార పట్టారు. ఎస్సీ విద్యార్థుల హాస్టళ్లలో సరైన సదుపాయాలు లేకపోవడం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారడం, రైతులను మోసం చేయడం, ఇసుక–మట్టి దందాలను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎండగట్టారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన యువతను, రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. ఈ నెల 12న రావులపాలెంలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చంద్రబాబు వంచన పాలన :

పార్లమెంట్‌ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ

కో ఆర్డినేటర్‌ విశ్వరూప్‌

అమలాపురం టౌన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంచన పాలనతో రాష్ట్ర ప్రజలను అష్ట కష్టాలకు గురిచేస్తోందని వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక యెండూరి ఫంక్షన్‌ హాలులో నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విశ్వరూప్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), జోన్‌–2 మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చింతా అనురాధ సమావేశంలో ప్రసంగించి చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.

12న బైక్‌ ర్యాలీ

అమలాపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లపై ఈ నెల 12న నిర్వహించే బైక్‌ ర్యాలీని విజయవంతం చేయాలని నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 60 గ్రామాలు, 30 మున్సిపల్‌ వార్డుల నుంచి దాదాపు 5 వేల మంది బైక్‌ ర్యాలీలో పాల్గోవాలని డాక్టర్‌ శ్రీకాంత్‌ సూచించారు. తొలుత చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అరాచకాలు, వైఎస్సార్‌ సీపీ పోరాటాలు, నిరసనలపై ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పార్టీ నాయకులు వీక్షించారు. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ నాయకులపై సాగించిన దమనకాండ, హత్యలు, వేధింపులపై ఏర్పాటు చేసిన ఈ ఫొటోలు ఆలోచింపజేశాయి.

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రైతులు పడుతున్న కష్టనష్టాలకు రాబోయే జగన్‌ ప్రభుత్వంలోనే సాంత్వన చేకూరుతుందన్నారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకే ప్రజలు విసిగి వేసారి పోయారని, వచ్చేది జగన్‌ పాలనతో వారికి మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌ (నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు), పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, అమలాపురం పట్టణ, రూరల్‌, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, కొనుకు బాపూజీ, బద్రి బాబ్జీ, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్‌, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ కమిటీల నాయకులు ఉండ్రు బాబ్జి, మట్టపర్తి నాగేంద్ర, జిన్నూరి వెంకటేశ్వరరావు, చీకట్ల కిషోర్‌, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, వంగా గిరిజాకుమారి, మిండగుదటి శిరీష్‌, సలాది సతీష్‌, గొవ్వాల రాజేష్‌, సుంకర లక్ష్మి, సరెళ్ల రామకృష్ణ, ఉండ్రు వెంకటేష్‌, కామిశెట్టి శ్రీను, సూదా గణపతి, విత్తనాల మూర్తి, కేటీ వర్మ, రెడ్డి సత్య నాగేంద్రమణి, దూడల ఫణి, దొంగ నాగ సుధారాణి, పొగాకు శ్రీను, గుత్తుల రాజు, కొల్లాటి దుర్గాబాయి ప్రసంగించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తొలుత సమావేశపు వేదిక వద్ద కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసనగా నల్ల బెలూన్లను పార్టీ నాయకులు గాలిలోకి వదిలారు.

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌

చంద్రబాబు : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

ముమ్మిడివరం: వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబునాయుడేనని ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ విమర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ టౌన్‌ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో పొన్నాడ ముఖ్య అతిథిగా మాట్లాడారు. చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనలో ఇచ్చిన హమీలను గాలికొదిలేసి ప్రజలను ఘెరంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు 143 హమీలతో పాటు సూపర్‌ సిక్స్‌ పథకాల హమీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు నిలువునా మోసం చేశాడన్నారు.

ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు :

పిల్లి సూర్యప్రకాశ్‌

రామచంద్రపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అన్ని అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్‌ అన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని గాంధీపేటలో చర్చా వేదికను నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగాలకు చెందిన కార్యవర్గ సభ్యులు, నేతలతో సూర్యప్రకాశ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన కార్యక్రమాలపై ఆయన నాయకులతో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement