● జిల్లాలో కీలక రహదారుల కుంగుబాటు
● పలుచోట్ల డెల్టా కాలువల్లోకి జారిపోతున్న వైనం
● తరచూ ప్రమాదాలు
● రిటైనింగ్ వాల్స్ నిర్మించినా అంతే!
సాక్షి, అమలాపురం: పచ్చని కోనసీమలో ప్రయాణం.. ప్రకృతి అందాల మధ్య సాగిపోతుంది. వంపులు తిరుగుతూ.. గలగలపారే పంట కాలువలను ఆనుకుని సాగే ప్రయాణం ఎవరికై నా మధురానుభూతిని పంచుతుంది. కాని ఆ కాలువ వెంబడి సాగే రహదారిపై ప్రయాణం ఇప్పుడు ప్రమాదభరితంగా మారుతోంది. జిల్లాలో పలు రహదారులు కుంగిపోతున్నాయి. పంట కాలువలను ఆనుకుని నిర్మించిన ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారులు కాలువ వైపు కుంగిపోతూ ప్రమాద భరితంగా మారిపోతున్నాయి. రహదారి కుంగిపోకుండా రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు.
ప్రమాదాల బారిన వాహన చోదకులు
జిల్లాలో కీలకమైన అమలాపురం– రావులపాలెం, కొత్తపేట– ముమ్మిడివరం, రాజవరం– పొదలాడ వంటి ఆర్‌అండ్‌బీ రోడ్లు, వెంకటాయపాలెం– యర్ర పోతవరం, పుదుచ్చేరీ యానాం– ద్రాక్షారామ రహదారి, పంచాయతీరాజ్ శాఖ రోడ్లు పలుచోట్ల కుంగిపోతున్నాయి. ఇటువంటి చోట్ల వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల అమలాపురం ఈదరపల్లి నుంచి అంబాజీపేట మండలం ముక్కామల వరకు రోడ్డుపై రాకపోకలు నిలిపి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. గంగలకుర్రు గ్రామం చుట్టూ రింగ్ రోడ్డు తరహాలో నిర్మించిన రహదారి సైతం కుంగిపోయింది. కౌశికను ఆనుకుని ఐదారు అడుగుల ఎత్తున చైనా వాల్ తరహాలో రిటైనింగ్‌వాల్ నిర్మించారు. అయినా ఫలితం లేదు. ఇటీవల ఈ రోడ్డును మరోసారి ఆధునీకరించినా మళ్లీ కుంగిపోయింది. అమలాపురం మండలం ఇందుపల్లి వంతెన నుంచి పేరూరు ఎత్తు రోడ్డు వరకు నిర్మించిన పీఆర్ రహదారి సైతం పలుచోట్ల కాలువల్లోకి జారిపోతోంది. రాజవరం– పొదలాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరించడంతోపాటు కొత్త రహదారి నిర్మించారు. పలుచోట్ల భారీ రిటైనింగ్ వాల్స్ నిర్మించారు. పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌ను అనుకున్న ఈ రహదారి పలుచోట్ల కాలువ వైపు దిగబడిపోతోంది. రాజోలు మండలం తాటిపాక మఠం వద్ద రోడ్డు కాలువలోకి కొట్టుకుపోతోంది. పొదలాడ– రాజోలు రహదారిలో రాజోలు వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పార్కు వద్ద రహదారి పరిస్థితి ఇలానే ఉంది.
ప్రయోగం విజయవంతమైనా..
రోడ్ల వెంబడి రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తున్నా పలుచోట్ల కుంగిపోతున్నాయి. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సాయిల్ స్టెబిలైజేషన్ విత్ జియోమ్యాట్ ర్యాపింగ్ రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలాపురం– ముక్కామల మధ్య నిర్మించిన రహదారిలో కొంతభాగం కుంగిపోవడంతో రిటైనింగ్ వాల్‌కు ప్రత్యామ్నాయంగా జియోమ్యాట్... కాయర్ మ్యాట్‌లతో రహదారిని పటిష్టం చేశారు. రూ.ఆరు లక్షలు ఖర్చు కావాల్సిన పనిలో రూ.1.80 లక్షలు కలిసి రావడంతోపాటు రోడ్డు పటిష్టంగా ఉంది. తరువాత ఉప్పలగుప్తం నుంచి వాసాలతిప్ప వరకు ఉన్న రోడ్డులో కూడా కుంగినచోట ఇదే విధంగా నిర్మాణం చేశారు. ఈ విధానం విజయవంతం అయినా ఆర్‌అండ్‌బీ, పీఆర్ అధికారులు పూర్తిస్థాయిలో వీటి మీద దృష్టి పెట్టడం లేదు.
అదనపు భారం
గోదావరి డెల్టా కాలువ వ్యవస్థ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంటే... రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీలు నిర్మించే రహదారులు పెనుభారంగా మారుతున్నాయి. గోదావరి డెల్టా పరిధిలో రహదారులు కాలువల వెంబడి నిర్మించాల్సి రావడంతో ఆయా శాఖలకు అదనపు భారం పడుతోంది. ఇదే సమయంలో సీమలో నల్లమట్టి కావడం వల్ల, కొత్త రహదారిని ఐదులేయర్లతో వేయాల్సి రావడం వల్ల అదనపు ఖర్చవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువల విస్తీర్ణం సుమారు 4,927 కిలోమీటర్లు. పంట కాలువల వెంబడి ఆర్‌అండ్‌బీ, పీఆర్, గ్రామ పంచాయతీల రహదారుల నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. రిటైనింగ్ వాల్స్, కల్వర్టులు, వంతెనల నిర్మాణాల వల్ల రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చు కన్నా అదనంగా 50 శాతం నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పంట కాలువ లోతు, రహదారి విస్తీర్ణాన్ని బట్టి మీటరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతోంది. మిగిలిన ప్రాంతాలతో రహదారులను పోల్చుకుంటే కోనసీమలో రహదారుల నిర్మాణానికి 30 శాతం అదనంగా ఖర్చవుతోంది.


