విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మృతులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మృతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

అల్లవరం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు సజీవ దహనమై మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంభాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే స్టీల్‌ ప్లాంట్‌లో పెను ప్రమాదం

ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్‌

అమలాపురం టౌన్‌: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పెను ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరిగిందని భారత రిపబ్లికన్‌ పార్టీ (ఆర్‌పీఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్‌ ధ్వజమెత్తారు. స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసే కార్మికులకు భద్రత లేదని, సేఫ్‌ గార్డింగ్‌ మెథడ్స్‌ పూర్తిగా కరువవడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించారు. స్థానిక అరిగెలపాలెంలో మంగళవారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో లోక్‌ మాట్లాడారు. 2012లోనే ఆర్‌పీఐ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన గేట్‌ వద్ద జరిగిన సమావేశంలో భద్రతా లోపాలపై ఆ సంస్థ యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని లోక్‌ గుర్తు చేశారు. ఈ 14 ఏళ్లలో స్టీల్‌ ప్లాంట్‌లో భద్రతా లోపాలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రమాదంలో బాధితులైన కుటుంబాలకు ఇల్లు, రూ.కోటి పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని లోక్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు డి.నాగేశ్వరరావు, పండు రాజేష్‌, డి.అశోక్‌ చక్రవర్తి, పరమట శ్రీను, ఈవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

భారత భవితకు విద్యార్థులే పునాదిరాళ్లు

అమలాపురం టౌన్‌: భారత భవిష్యత్‌కు విద్యార్థులే పునాది రాళ్లు అని డీఈవో పి.నాగేశ్వరరావు అన్నారు. అమలాపురంలోని కొంకాపల్లి జవహర్‌ లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న జ్ఞాన ప్రకాష్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ టైనింగ్‌ క్లాసులు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈవో నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (సాల్ట్‌)లో భాగంగా ఎన్‌జీవో సంస్థ ప్రథమ్‌ భాగస్వామ్యంతో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రారంభించిందని డీఈవో తెలిపారు. నూతన విద్యా విధానం –2020లో భాగంగా చేపట్టే విద్యా సంస్కరణలను క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్లే కార్యక్రమంలో భాగంగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతుల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యా బోధన అమలు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఒకటో తరగతి బోధన చేసే ఉపాధ్యాయులకు 1,337 మందికి రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట, రాజోలు ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ ఇచ్చినట్లు డీఈవో పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.సీతామహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు, ఏపీవో డాక్టర్‌ ఎంఏకే భీమారావు, అమలాపురం ఎంఈవో ఎస్‌.దుర్గాదేవి ప్రసంగించారు. చివరగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు డీఈవో ఽధ్రువీకరణ పత్రాలు అందించారు.

మడ అడవుల విస్తరణకు ప్రాధాన్యం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): హరిత వాతావరణ నిధి (జీసీఎఫ్‌) లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి ఎన్‌.రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టాలని, దీంతో పాటు గతంలో 180.58 హెక్టార్లలో పునరుద్ధరించిన అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంయుక్త సహకారంతో జీసీఎఫ్‌ నిధులతో కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, పరిసర తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాధించిన ఫలితాలను అధికారులు వివరించారు. జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి నమోదైందని రామచంద్రరావు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ టి.తిప్పేనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement