పెరుగుతున్న పెట్రో, గ్యాస్‌ ధరలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న పెట్రో, గ్యాస్‌ ధరలపై కన్నెర్ర

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

అమలాపురంలో వామపక్షాల రాస్తారోకో

అమలాపురం టౌన్‌: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు అమలాపురం గడియారం స్తంభం సెంటరులో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల జిల్లా నేతలు ఈ నిరసన చేపట్టారు. కృష్ణా– గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, గ్యాస్‌ వనరుల్లో 50 శాతం వాటా మన రాష్ట్రానికి దక్కాల్సి ఉండగా కార్పొరేట్‌ ఆయిల్‌ కంపెనీలు లాభాల బాటలో నడిచేలా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినప్పటికీ ఇంధన ధరలను పెంచుతూ లీటర్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.20, రాష్ట్ర ప్రభుత్వం రూ.35 చొప్పున భారీగా పన్నులు వడ్డించి ప్రజల నడ్డి విరుస్తున్నాయని సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకుడు కె.సత్తిబాబు ఆరోపించారు. రాస్తారోకో నిరసన కార్యక్రమంలో వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు వాసంశెట్టి సత్తిరాజు, డి.శివప్రసాద్‌, నూకల బలరామ్‌, పీతల రామచంద్రరావు, జి.దుర్గా ప్రసాద్‌, సఖిలే సూర్యనారాయణ నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement