ప్రమాద ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

కపిలేశ్వరపురం (మండపేట): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మెల్టింగ్‌ షాపులో మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ పేలుడు ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఘటన పట్ల మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది కార్మికులు సజీవ దహనం కావడం, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆలోచనల కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. కర్మాగారంలో సరిపడా కార్మికులు ఉండాలని, వారికి తగిన రక్షణ, ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చగలిగే సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వాటిని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. అమాయక కార్మికుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో వెంటనే విచారణ జరపాలని, చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గాయపడినవారు పూర్తిగా కోలుకునేవరకూ మెరుగైన చికిత్స అందించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement