● మద్దతు ధర కోసం ఎదురుచూపులు
● పెట్టుబడులు పెరిగినా
కానరాని ప్రభుత్వ సాయం
● నష్టాల ఊబిలో పుడమి పుత్రులు
సాగులో పెట్టుబడి తడిసిమోపెడవుతోంది.. నారుమళ్ల నుంచి కోతల వరకూ ఖర్చు పెరుగుతోంది.. అయినా మద్దతు ధర కోసం పుడమి పుత్రులు అల్లాడాల్సిన పరిస్థితి దాపురించింది.. చంద్రబాబు సర్కారులో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. రబీ పంటకు మద్దతు ధర రాకపోగా, ఇప్పుడేమో ఖరీఫ్‌పై ఎన్నో ఆశలతో రైతన్నలు ముందుకు సాగుతున్నారు.
ఆలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వరి సాగు ప్రహసనంగా మారింది. ఏటా ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగి, కూలీల ఖర్చు అధికమై, వ్యవసాయం భారం అవుతోంది. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం ఇబ్బందిగా పరిణమిస్తోంది. వరి సాగులో పెరుగుతున్న పెట్టుబడికి అనుగుణంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదని రైతన్నలు పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్‌లో సాగు చేయడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత రబీ సీజన్లో 1.32 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దిగుబడి 4.80 మెట్రిక్ లక్షల టన్నులు వచ్చింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం 2.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇంకా రైతుల వద్ద సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులంతా ఎదురుచూపులు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక పొలాల్లోనే బరకాలు కప్పి కొందరు ధాన్యాన్ని ఉంచారు.
నాడు ఘనం.. నేడు హీనం
జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 1.69 లక్షల ఎకరాల్లో, దాదాపు సుమారు 1.25 లక్షల మంది రైతులు, కౌలు రైతులు వరి సాగు చేపట్టనున్నారు. ఖరీఫ్‌లో సుమారు 2.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం గణనీయంగా ఏటా రూ.150 నుంచి రూ.200 వరకూ ధరల పెంపును కొనసాగించింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025–26లో రూ.69లు, 2026–27లో రూ.72 మాత్రమే పెంచి రైతన్నల నడ్డివిరిచింది.
ఎంతో వ్యత్యాసం
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి పంట పొలంలో క్వింటా ధాన్యం పండించేందుకు రూ.1,500 వరకూ ఖర్చు అవుతుంది. దీనిని బట్టి ప్రభుత్వ గణాంకాల ప్రకారం క్వింటాకు రూ.3,700 వరకూ ధర ప్రకటించాలి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్‌లో ఎకరాకు రూ.33,750 వేల వరకూ పెట్టుబడి అవుతుండగా, ధాన్యం దిగుబడి మాత్రం 24 నుంచి 28 బస్తాల మాత్రమే ఉంటుంది. అలాగే రబీ సీజన్‌లో ఎకరాకు రూ.45 వేల వరకూ ఖర్చవుతుండగా, 45 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు శ్రమ దోపిడీకి గురవుతున్నాడు.


