పుస్తకాలు సరే..కిట్ల సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు సరే..కిట్ల సంగతేంటి?

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

నాణ్యమైన కిట్లు

పంపిణీ చేయాలి

గత ఏడాది పంపిణీ చేసిన కిట్లలో నాణ్యత లేదు. ఈ ఏడాదైనా నాణ్యమైన మిత్ర కిట్లు పంపిణీ చేయాలి.

– రొట్టె నవీన్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ

మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు

12న పాఠశాలల పునః ప్రారంభం

గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన

రోజే విద్యా కిట్ల పంపిణీ

మండల కేంద్రాలకు చేరుకోని కిట్లు

విద్యార్థుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు

నిడదవోలు: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం కాలేదు. ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కూటమి సర్కారు ముందుచూపులేని పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ఏడాది నిరాశే మిగలనుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం రోజున ఆనందంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఈ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకున్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా అధికారులు పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది మాత్రం ఉత్సాహంగా నూతన తరగతులకు హాజరయ్యే విద్యార్తులకు మొదటి రోజే కిట్ల పంపిణీ లేకపోవడంతో నిరాశే మిగలనుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పట్టింది.

గత ప్రభుత్వంలో

స్కూల్‌ తెరవగానే కిట్ల పంపిణీ

నిడదవోలు నియోజకవర్గంలో 30 హైస్కూళ్లు, 127 ప్రాథమిక పాఠశాలల ఉన్నాయి. ఈపాఠశాలల్లో చదువుతున్న 10,891 మంది విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెల పైగా పట్టే పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, డిక్షనరీలు మినహా ఆయా మండల కేంద్రాలకు విద్యమిత్ర కిట్ల సామగ్రి చేరుకోలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమే అని నమ్మిన మాజీ సీఎం జగన్‌ నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్‌ కిట్లను ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండగలా పంపిణీ చేయించేవారు.

విద్యా వ్యవస్థను పట్టించుకోని బాబు సర్కారు

చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విద్య వ్యవస్థను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన భరోసా కరవైంది. విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బ్యాగు, రెండేసి జతల చొప్పున యూనిఫాం, బూట్లు, నోటు పుస్తకాలు, సాక్సులు, టై, బెల్టు ఇప్పటి వరకు మండల కేంద్రాలకు చేరలేదు.

Advertisement
 
Advertisement
Advertisement