ఫ ప్రజలపై మళ్లీ గ్యాస్ భారం
ఫ గృహావసరాల సిలిండర్ల ధర పెంచిన
కేంద్రం
ఫ రూ.972కు చేరిన వైనం
ఫ ఇది మూడు నెలల్లో రెండోసారి
సాక్షి, అమలాపురం: ఒకవైపు చమురు.. మరోవైపు సహజ వాయువులు.. ధరలు పెంచుతూ గడిచిన రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం వాతలు పెడుతూనే ఉంది. ప్రజల ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోకుండా దఫదఫాలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుంది. దీనికి కొనసాగింపుగా ఈ వారం ఆరంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా గృహావసరాల వంట గ్యాస్ ధరనూ భారీగా పెంచింది. దీనితో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయ్యింది.
గత మే నెల ఒకటో తేదీ నాటికి జిల్లాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,019.50 ఉండేది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో సిలిండర్‌పై ఒకేసారి ఏకంగా రూ.993.50 ధర పెంచింది. పెరిగిన ధరలతో జిల్లాలో ఆ గ్యాస్ ధర రూ.3,184కు చేరింది. ఇక ఈ నెల మొదటి వారంలో మరోసారి వాణిజ్య సిలిండర్ ధర రూ.40 వరకూ పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.3,236కు చేరింది. ఈ ధరల పెంపు చూసి చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకూ బెంబేలెత్తిపోయారు. తాజాగా సిలిండర్ మీద రూ.40 పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో సిలెండర్‌పై రూ.1,051 పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర చూసి తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారుచేసే వారు వాపోతున్నారు.
తార్‌మార్ చేసి..
పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్లు ఇక పూర్తిగా బ్లాక్ కానున్నాయి. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 1,731 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి వ్యాపార కేంద్రాలు వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడంతో 90 శాతం హోటళ్లలో గృహావసరాల సిలిండర్లు వినియోగిస్తున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద హోటళ్లల్లో మాత్రమే వాణిజ్య అవసరాల సిలిండర్లను వినియోగిస్తున్నారు. అయితే గత నెల నుంచి వాణిజ్య సిలిండర్ల బుకింగ్ కూడా తగ్గిపోయింది. గృహావసరాల సిలిండర్లలోని గ్యాస్‌ను వాణిజ్య అవసరాల సిలిండర్‌లోకి డంప్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ లేకుండా హోటళ్లు నడుపుతున్న వారు నేరుగా గృహ అవసరాల గ్యాస్‌నే వాడుతున్నారు. గ్యాస్ కొరత సమయంలో చాలా మంది హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలు వినియోగించారు. అయితే ఇప్పుడు గ్యాస్ లభ్యమవుతున్నా, పెరిగిన ధరలు చూసి పొయ్యిలపై వంటకాలను కొనసాగిస్తుండడం విశేషం.
అన్నింటా పెరుగుదల
గృహావసరాలకు సంబంధించిన సిలిండర్ల ధర పెంపుతో పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వారు ఇప్పటికే కుదేలవుతున్నారు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు పెరిగి జనం అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి గ్యాస్ ధర అదనపు భారంగా మారడంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులు కానుంది.
తాజా ఇలా బాదుడు
తాజాగా కేంద్ర ప్రభుత్వం గృహావసరాలకు సంబంధించిన గ్యాస్ ధరలను పెంచింది. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.29 వరకూ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ధర ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. గత ఏప్రిల్ నెలలో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే. అప్పుడు పెంచిన ధరతో రూ.943కు చేరింది. తాజాగా పెరిగిన ధరతో జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.972 అయ్యింది. జిల్లాలో గృహావసరాల గ్యాస్ కనెక్షన్లు 4,79,563 వరకూ ఉన్నాయి. గడిచిన రెండు నెలల్లో ఇది రెండోసారి పెంపు కాగా, సిలిండర్‌పై రూ.79 వరకు పెంచడం సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందిగా మారింది. దీనికి డోర్ డెలివరీ చార్జీలు సిలిండర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ అదనపు భారం కానున్న విషయం తెలిసిందే. ఇలా పెంచుకుంటూ పోతుంటే ఎలా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


