● కోలుకోని వర్జీనియా పొగాకు మార్కెట్
● వేలం కేంద్రాలకు చేరుకోని బేళ్లు
● గిట్టుబాటు లేక నలిగిపోతున్న రైతులు
దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలు దాటినా గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడ్డారు. అంతర్జాతీయ సంక్షోభంతో కొనుగోళ్లు మందగించినట్టు అధికారులు చెప్తున్నారు. వేలానికి తీసుకువచ్చిన బేళ్లను నాణ్యత లేదని కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారని, కనీసం 50 శాతం కూడా అమ్ముడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు సైతం రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నాడు. తప్పేది లేక వారంతా బయట దళారుల వద్దే వారు చెప్పిన ధరకే పొగాకు విక్రయించి వదిలించుకుంటున్నారు.
రంగు మారుతున్న పొగాకు
గ్రేడింగ్ పూర్తిచేసి, బేళ్లు కట్టిన పొగాకు ఇటీవలి ఎండల తీవ్రతకు రంగు మారిపోతోంది. రంగు మారితే కొనుకోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటి నాలుగు రెలుపుల పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలు చేయనిపరిస్థితి ఏర్పడింది.
రూ. 71.39 కోట్ల విక్రయాలు
టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.71.39 కోట్ల విలువైన 27.57 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభించి 73 రోజులు కాగా, 46 రోజులు వేలం జరిగింది. 2025–26 పంట కాలానికి 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో సుమారు 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి చేశారు. బోర్డు నిర్దేశించిన పరిమాణం కంటే అదనంగా సుమారు 35 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి జరిగినట్టు గణాంకాలు చెపుతున్నాయి.
నిలకడగా పొగాకు ధర
మార్కెట్లో పొగాకు ధర నిలకడగా సాగుతుంది. కిలో గరిష్ఠ ధర రూ.260, కనిష్ఠ ధర రూ.180, సగటు ధర రూ.258.95కి విక్రయిస్తున్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. సగటు ధర కిలో రూ.320 ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొగాకు గరిష్ట ధర రూ.265 కాగా,
కొనుగోళ్లు, సగటు ధరలు ఇలా ఉన్నాయి..
వేలం కేంద్రం కొనుగోలు సగటు ధర (కిలోల్లో)
దేవరపలి 387674 256.70
జంగారెడ్డిగూడెం–1 723158 259.64
జంగారెడ్డిగూడెం–2 539732 260.23
కొయ్యలగూడెం 532183 258.37
గోపాలపురం 574468 258.93
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలం కేంద్రాలకు వస్తున్న ట్రేడర్లు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.


